Sunday 11 January 2015

ముగ్గులు - భూతయజ్ఞం

ప్రతి హిందువు రోజు తప్పకుండా 5 యజ్ఞాలు చేయాలి. అందులో ఆఖరిది భూతయజ్ఞం, భూతములు అంటే జీవులు, ప్రాణులని అర్ధం. ప్రకృతిలో మనతో కలిసి జీవనం సాగిస్తూ, మనకు ఎంతగానో సహాయపడుతున్న జీవరాశికి ఆహారం వేయడం మన ధర్మమని భగవతాజ్ఞ. సద్గురువు శ్రీ సాయినాధుడు కూడా అన్ని జీవుల ఆకలిని తీర్చమన్నాడు.

అంతేకాదు మనిషి జీవితంలో కలగలిసిపోయిన అనేక జీవరాశులను మన నుంచి పూర్తిగా వేరు చేయలేము. ఈ జీవవైవిధ్య సూత్రం మనం ఇష్టపడే పిల్లి, కుక్క, మేక, ఆవు కే కాదు .. మనం విసుక్కునే చీమ, బల్లి, ఎలుక, బొద్దింకలకూ వర్తిస్తుంది. మన ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ, వాటిని మనం నియంత్రించాలిగాని .. నాశనం చేయకూడదు. ఎంతోకొంత జీవకారుణ్యం చూపితే ఇంకా మేలు! మనం సంప్రదాయంలో ముగ్గులు వేయడం వెనుకా జీవకారుణ్య కోణం ఉంది. ఒకప్పుడు బియ్యంపొడినే ముగ్గుపిండిగా వాడేవారు. ఇది ........ ఇంటి ముంగిలికి అందాన్నే కాదు చీమలకు ఆహారంగా కూడా ఉండేది. చీమలు ఆహారం కోసం ఇంట్లోకి బారులు తీరకుండా ఒకే చోట వాటికి ఆహారం అందించే ఉపాయం ఇది. అంత ఆహారం దొరికితే ఇక చీమలు వంటగదులపై ఎందుకు దాడి చేస్తాయి? నా పుట్టలో వేలు పెడితే కుట్టనా అంటూ ఎందుకు గారాలు పోతాయ్? అంతేకాదు, పొయ్యి దగ్గర కూడా ఆవుపేడతో అలికి ముగులు పెట్టే సంప్రదాయం వెనుక ఉన్న రహస్యం కూడా ఇదే. చీమలే కాదు...... పిచ్చుకలకూ ఈ ముగ్గుపిండి (బియ్యపు పిండి) ఆహారంగా ఉండేది. మన నగరాల్లో సింధటిక్ ముగ్గులు, సున్నం ముగ్గులు పెరగడం కూడా పిచ్చుకల సంఖ్య తగ్గడానికి ఓ కారణం.

No comments:

Post a Comment