Tuesday 20 January 2015

హిందూ ధర్మం - 131

వేదాలను నాలుగు భాగాలుగా చెప్పుకున్నాం. అందులో మంత్రసంహిత అన్నిటికి మూలం. ఈ మొత్తం వేదాలను మళ్ళీ రెండుగా విభాగం చేస్తారు. ఒకటి కర్మకాండ / ఆచారకాండ, రెండవది జ్ఞానకాండ. బ్రాహ్మణాలు ధర్మాలు, కర్మల గురించి వివరిస్తాయి. ఆరణ్యకాలలో తత్వచింతన, ఉపాసనలు చెప్పబడడం వలన వాటిని ఉపాసనాకాండ అని చెప్పినా, వాటిని కూడా ఆరణ్యకాలతో కలిపి కర్మకాండ అంటారు. ఉపనిషత్తులలో పూర్తిగా పారమార్ధిక (అలౌకిక/ భగవత్/ ఆత్మ) జ్ఞానం ఉంటుంది, వాటిలో కర్మల గురించి ఉండదు కనుక వాటిని జ్ఞానకాండ అంటారు. ఈ రెండిటిలో ఒకటి ముఖ్యము, వెరొకటి కాదు అని ఎక్కడ చెప్పబడలేదు. ఈ మధ్య చాలా కొత్త కొత్త వాదనలు వచ్చాయి. వేదం సత్వ, రజస్, తమో గుణాలతో ఉంటుంది. కానీ వేదాంతం దీనికి అతీతంగా ఉంటుంది. కనుక భగవద్దర్శనానికి వేదాంతమే మార్గమని కొందరు అంటున్నారు. అదీగాకా వేదంలో చెప్పబడ్డ కర్మలను వేదాంతం నిరసించిందని, రకరకాలా ఉపాసనలను ఖండించిందని అంటున్నారు. కానీ అది తప్పుడు వాదన. ఒకవేళ అదే కనుక సత్యమైతే, భగవంతుడు కర్మకాండను ఎందుకిస్తాడు? ఆయనకంటే వీళ్ళు సర్వజ్ఞులు, జ్ఞానులు కాదు. సత్వ, రజస్, తమో గుణాలకు అతీతమైనది వేదం. వేదం వేరు, వేదాంతం వేరు కాదు, మంత్రసంహిత ఆధారంగానే మిగితావన్నీ వచ్చాయి. వేదాంతం కూడా వేదంలో భాగమే. అటువంటప్పుడు వేదాంతం వేదాన్ని ఎలా ఖండిస్తుంది? అలా ఖండించడం అంటే వేదాన్ని వేదం ఖండిస్తుందని చెప్పడమే అవుతుంది.

ఆదిశంకరుల ప్రస్తావన కూడా ఇక్కడ కొందరు తెస్తారు. ఆదిశంకరులు కూడా ఎక్కడ కర్మను నిరసించలేదు. కేవలం కర్మకే అంటిపెట్టుకుని ఉండకండి, కర్మతో పాటు జ్ఞానం ప్రధానం అన్నారు. వారున్న సమయంలో సమాజంలో ప్రజలు పూర్తిగా జ్ఞానభాగాన్ని విడిచిపెట్టడం వలన కర్మకంటే జ్ఞానం ప్రధానమని వాదించారు. కానీ మళ్ళీ వారే పూజలు మొదలైనవాటి కోసం పంచాయతనం, స్తోత్రాలు ఇచ్చారు. కర్మకాండ ఆచరించకుండా జ్ఞానకాండ అర్దం కాదు. కొన్ని కోట్ల జన్మల తర్వాత మానుష జన్మ వస్తుంది. పూర్వజన్మ సంస్కారాలు మనిషి మీద బలీయమైన ప్రభావన్ని చూపిస్తాయి. ఇంతకముందు జన్మలలో ఆ వ్యక్తున్న అలవాట్లు, ఇష్టాయిష్టాలు ఈ జన్మలో అతని ప్రవర్తనను, ఇష్టాయిష్టాలను నియంత్రిస్తాయి. అప్పటి సంస్కారాలు చాలా బలీయంగా సూక్ష్మశరీరం / మనసుపై ముద్ర వేస్తాయి. వాటిని వదిలించుకుని, బయట పడడం కష్టం. వ్యక్తి తాను ఎంత నియంత్రిచుకున్నా, పూర్వజన్మ వాసనలు అతనితో రకరకాల దుష్టకార్యాలను చేయటానికి ప్రేరేపిస్తాయి. ఇంత సంఘర్షణ ఉన్న మనిషికి ఉపనిషత్తులలో చెప్పబడిన బ్రహ్మజ్ఞానం అంత త్వరగా బోధపడదు. అందుకే ధర్మం వచ్చింది, ఆచారకాండ / కర్మకాండ వచ్చింది.

To be continued ..................

No comments:

Post a Comment