Wednesday 14 January 2015

మకర సంక్రాంతి

సం అంటే మంచి, క్రాంతి అంటే మార్పు. సంక్రాంతి అంటే మంచి మార్పు అని అర్దం. అంతరిక్షం మొత్తాన్ని 360°గా, 12 రాశులుగా విభజించింది జ్యోతిష్య శాస్త్రం. సూర్యుడు ప్రతి రాశిలోకి ప్రవేశించే సమయాన్నే సంక్రమణం అంటారు. సూర్యుడు ఒక్కో రాశిలో నెలరోజులా పాటు ఉంటాడు. అలా మనకు ఒక ఏడాదిలో 12 సంక్రాంతులు వస్తాయి. సూర్యుడు ప్రవేశించడమేంటి అనే అనుమానం వస్తుంది. భూభ్రమణంలో కలిగే మార్పులను అనుసరించి, భూమి యొక్క అక్షాంశ, రేఖాంశలను బట్టి, భూమికి సూర్యునికి మధ్య ఉన్న దూరాన్ని అనుసరించి ఈ నిర్ణయం జరుగుతుంది. మనం భూమిపై నుంచి గమనిస్తాం కనుక, సూర్యుడు ప్రవేశించాడంటున్నాం. నిజానికి సూర్యుడు ఎప్పుడు తన స్థానంలోనే ఉంటాడు. ఈ విషయం ఆధునికసైన్సు చెప్పక కొన్ని వేల ఏళ్ళ పూర్వమే హిందువులకు తెలుసు. శథపధ బ్రాహ్మణం 'నిజానికి సూర్యుడు ఉదయించడు, అస్తమించడు. భూమి తన చుట్టూ తాను తిరగడం వలన, పగలు రాత్రి ఏర్పడుతున్నాయి' అంటూ చాలా స్పష్టంగా చెప్పింది.

ఏడాదిలో 12 సంక్రాంతులు ముఖ్యమే అయినా, అందులో మకర సంక్రమణం, కర్కాటక సంక్రమణం ప్రధానమైనవి. మకరసంక్రాంతితో ఉత్తరాయణ పుణ్యకాలం మొదలవుతుంది. ఉత్తరాయణంలో భూమికి సూర్యునికి మధ్య దూరం తక్కువగా ఉంటుంది. ఉత్తరాయణం దేవతలకు పగలు. ఈ కాలంలోనే ఎన్నో శుభకార్యాలు చేస్తారు. ఈ ఉత్తరాయణం ఈ మకరసంక్రమణంతోనే మొదలవడంతో ఇది పెద్ద పండుగ, ముఖ్యంగా సూర్యునికి సంబంధించిన ముఖ్యమైన పండుగ. సంక్రాంతులలో పితృదేవతలను పూజించాలి, వారికి తర్పణాలు వదలాలి. దీనివల్ల పితృదేవతల అనుగ్రహం కలిగి, సంతానం వృద్ధిలోకి వస్తుంది. ఈ రోజు ఉదయమే తలస్నానం చేసి, కొత్త బట్టలు ధరించాలి. గంగా, యమున, గోదావరి, సరస్వతీ నదులను స్మరించి పుణ్యస్నానం చేయాలి. ఇష్టదేవతలకు, కులదేవతలకు, ఇలవేల్పులకు, గ్రామదేవతలను స్మరించాలి, పూజించాలి. పండుగ రోజునే కాదు ప్రతి రోజు గోమాతను దర్శిస్తే సకలశుభాలు కలుగుతాయి. అలా కుదరని పక్షంలో కనీసం సంక్రాంతులలోనైనా ఆవును (గోమాతను) దర్శించి, గ్రాసం తినిపించడం వలన మంచిఫలితాలు వస్తాయి. అట్లాగే సంక్రాతులలో శ్రీ విష్ణు, లలితా సహస్రానామపారాయణలు మంచి ఫలితాన్ని ఇస్తాయి.

ఇదండీ మకర సంక్రాంతి విశేషం. అందరికి సంక్రాంతి శుభాకాంక్షలు. 

No comments:

Post a Comment