Wednesday 21 May 2014

మే 22, ప్రపంచ జీవ వైవిధ్య దినోత్సవం - మన సంస్కృతి

ఈ సృష్టిలో అన్నిటిలో ఏకత్వం ఎంత ఉందో,  భౌతికంగా, మానసికంగా భిన్నత్వం కూడా అంతే ఉంది. వైవిధ్యమే సృష్టి లక్షణం అంటారు స్వామి వివేకానంద. పరమాత్మ ఈ భూమిని సృష్టించినప్పుడు మనిషితో కలిపి 84,00,000 జీవరాసులకు ఆయువుపోశాడు. వీటిలో ఏ ఒక్కటి అధికంగా కాదు, ఏదీ తక్కువ కాదు. అన్ని సమానమే. అన్ని ఒకదాని మీద ఒకటి ఆధారపడి జీవనం సాగించేలా ధర్మాన్ని ఏర్పాటు చేశాడు. మనిషి తన ప్రతి అవసరానికి ప్రకృతి మీద ఆధారపడ్డాడు. ప్రకృతి లేనిదే మనిషి జీవితం లేదు. ఇది గమనించిన భారతీయ ఋషులు జీవ వైవిధ్య చక్రం సక్రమంగా సాగేలా, ఎక్కడ మనిషి వాటిలో కల్పించుకునే వీలు లేకుండా మానవ ధర్మాలను చెప్పారు. వ్యవసాయ పద్దతులే కావచ్చు, జీవన విధానమే కావచ్చు, ఆహారపు అలవాట్లే కావచ్చు, అన్ని సృష్టి చక్రానికి లోబడే ఉంటాయి.

చెరువులో ఉండే కీటకాలను తిని కప్ప జీవిస్తుంది. కప్పను తిని పాము జీవిస్తుంది, పామును గద్ద తింటుంది, గద్ద మరణించాక దాన్ని క్రిములు తిని భూమిలో కలిపేస్తాయి. అది మొక్కలకు ఎరువుగా మారుతుంది. ఇదంతా ఒక గొలుసుకట్టు విధానం, ఒక వృత్తం. వీటిలో ఏ ఒక్క ప్రాణి అంతరించినా మిగితా అన్నిటి మీద ప్రత్యక్షంగా తీవ్ర ప్రభావం ఉంటుంది, మిగితా ప్రాణుల మీద పరోక్షంగా ముప్పు ఉంటుంది. ఇలా జగత్తులో అనేక వృత్తాలు ఉంటాయి. వాటిలో మనిషి ఏ మాత్రం జోక్యం చేసుకున్నా అది వినాశనానికి దారి తీస్తుంది, ఏ ఒక్క జీవి అంతరించినా, మానవమనుగడ ప్రశ్నార్ధకమవుతుంది. ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా ప్రతి ఏటా 10,000 జాతుల జీవరాసులు అంతరించిపోతున్నాయి.

అందుకే భారతీయ సంస్కృతిలో ప్రతి చిన్న ఆచారం ప్రకృతిహితంగానే ఉంటుది. వ్యవసాయమే తీసుకోండి. ఏ విధమైన హైబ్రిడ్, బీటీ విత్తనాలు ఉండవు. రైతు సొంతంగా విత్తనాలు తయారు చేసుకుంటాడు. భూమి మనకు అమ్మ కనుక విషపు రసాయన ఎరువులతో నింపడు. కేవలం ఆవు పేడ, మూత్రాన్ని మాత్రమే ఉపయోగించి తాను సొంతంగా తయారు చేసుకున్న ఎరువునే వాడుతాడు. వ్యవసాయంలో ప్రకృతి సాయం తీసుకుంటాడు. అందుకే 3-4 రోజులు నీళ్ళు పెట్టకపోయినా, మొక్క వాడిపోదు. ఆఖరున దిగుబడి అధికంగా వస్తుంది, వచ్చినదాంట్లో కొంచం పిచ్చుకల కోసం సింహద్వారానికి ప్రత్యేకంగా కట్టి ఆహ్వానిస్తాడు. రసాయనాలు వాడని కారణంగా పొలంలో రకరకాల మిత్రజీవాలు కనిపిస్తాయి. వైవిధ్యం వెల్లివిరుస్తుంది. రైతుకు పెట్టుబడి పెట్టకుండా లాభం వస్తుంది. ఇది ప్రకృతి వ్యవసాయం. జీవవైవిధ్యాన్ని రక్షించే అచ్చమైన, స్వచ్చమైన భారతీయ వ్యవసాయపద్ధతి. ఈ విధానంలో పూసిన పూలు రెండు నుంచి మూడు రోజుల వరకు ప్రిజ్‌లో పెట్టకపోయిన వాడిపోవు, భూమి కొన్ని ఏళ్ళ తర్వాత ఏ విధమైన ఎరువు వేయకున్నా బంగారం పండిస్తుంది. కానీ ఆంగ్లేయులు వలసపాలనలో ఈ వ్యవసాయాన్ని దెబ్బకోట్టారు.

రసాయనిక ఎరువులను వాడి, భూమిని, జీవాలను చంపి, ఆఖరికి రైతే ఆత్మహత్య చేసుకునేందుకు దోహదపడే దిక్కుమాలిన పద్ధతిని ప్రవేశపెట్టారు. రసాయాలు, బీటీ, హైబ్రిడ్ విత్తనాలు, అన్నీ కలిసి దేశాన్ని రోగిష్టి దేశంగా మార్చేస్తున్నాయి. అనేక జీవజాతుల ప్రాణాలు తీస్తున్నాయి. తరతరాలుగా సొంతంగా మంచి దిగుబడినిచ్చే సహజవిత్తనాలను గిరిజనులు ఇప్పటికి రక్షించుకుంటూ వస్తున్నారు, ఏడాదికొకసారి జాతర ఏర్పాటు చేసుకుని విత్తన మార్పిడి చేసుకుంటున్నారు. కానీ లాభాలే ధేయ్యంగా పనిచేస్తున్న విదేశీ కంపెనీలు సర్వాన్ని నాశానం చేస్తున్నాయి. ఇది భస్మాసుర హస్తమై మొత్తం మానవజాతిని చంపేస్తుంది. ఇది కేవలం వ్యవసాయ రంగంలో జరుగుతున్న దారుణం మాత్రమే. మిగితా అనేక రంగాల్లో కూడా ఇదే తరహాలో జీవవైవిధ్య నిర్మూలన జరుగుతోంది.

మే 22, ప్రపంచ జీవ వైవిధ్య దినోత్సవం (International Bio-Diversity Day), ప్రపంచానికి జీవవైవిధ్యం యొక్క ప్రాముఖ్యతను గుర్తు చేస్తూంటే, భారతీయులకు తమ ప్రకృతిహితమైన ఆచారవ్యవహారాలను, వ్యవ్యసాయపద్ధతులను గుర్తుచేస్తోంది. చీమకు సైతం పిండి వేసి పోషించే సంస్కృతి మనది. మనం మళ్ళీ మనం పూర్వీకుల బాటలో నడవాలి. జీవవైవిధ్యాన్ని రక్షించి భావితరాలకు అందించాలి. ప్రపంచం ఆత్మ విమర్శ చేసుకోవాలి.

No comments:

Post a Comment