Saturday 24 May 2014

హిందూ ధర్మం - 65 (రాజర్షి విశ్వామిత్రుడు)

ఇది విన్న వశిష్టుడు 'ఎదురుగా ఉన్న ప్రత్యర్ధిని ఓడించగల శక్తిని సృష్టించు' అన్నారు శబలతో. ఈ మాట వినగానే శబల తన హుం కారం నుంచి వందలమంది పహ్లవులను తయారు చేసింది. వారందరూ విశ్వామిత్రుడు చూస్తుండగానే అతని మొత్తం సైన్యాన్ని నశింపజేశారు. ఇది చూసిన విశ్వామిత్రుడి కోపం రెట్టింపై అతని దగ్గరున్న అస్త్రాలతో పహ్లవులను చంపడం మొదలుపెట్టాడు. ఇది చూసిన శబల మళ్ళీ తన హుంకారాలతో వందల మంది యవనులను, శాకులను సృష్టించింది.

బంగారు వర్ణంతో వెలిగిపోతున్న యవనులు, శాకులతో భూమి నిండిపోయింది. వారిలో వీరత్వం ఉట్టిపడుతోంది, శత్రువులను జయించగలిగే ధైర్యం కనిపిస్తోంది. కత్తులు మొదలైన ఆయుధలు ధరించి, బంగారు వస్త్రాలు కట్టుకున్న ఈ వీరులు అగ్నివలె వెలిగిపోతూ, విశ్వామిత్రుని సైన్యాన్ని బూడిద చేశారు. ఇది చూసిన విశ్వామిత్రుడు అస్త్రాలను సంధించారు, వాటి చేత యవనులు, కాంభోజులు, బార్బరులు నశించారు.

ఇది చుసిన వశిష్టమహర్షి శబలతో 'ఓ కామధేనువా! నీ యోగశక్తితో మరింత బలవంతులను సృష్టించు' అన్నారు. శబల హుంకారం నుంచి ఉదయిస్తున్న సూర్యులవలె వెలిగిపోతున్న కాంభోజులు, పొదుగు నుంచి పహ్లవలు, ఇతర భాగాల నుంచి యవనులు, శకులు, వెంట్రుకల నుంచి మ్లేఛ్చులు, హరితులు, కిరాతకులు అనేబడే సైన్యం పుట్టింది. పుట్టిన క్షణమే విశ్వామిత్రుని రధాలను, ఏనుగులను, గుర్రాలను, ఇతర బలాలను మొత్తాన్ని చంపేశారు. ఇది చూసిన విశ్వామిత్రుని కుమారులు వందమంది ఆయుధాలు ధరించి వశిష్టమహర్షి మీద దాడికి వెళ్ళారు. కానీ వశిష్టమహర్షి ఊపిరి విడిచినప్పుడు వచ్చిన హుం అనే శబ్దంతో మిగిలిన సైన్యం, విశ్వామిత్రుని కుమారులు బూడిదైపోయారు. అందరూ నశించిపోవడం చూసి విశ్వామిత్రుడు తీవ్రమైన బాధకు లోనయ్యారు. కెరటాలు లేని సముద్రంలా, కోరులు కోల్పోయిన పాములా, గ్రహణం పట్టిన సూర్యునిలా, కొడుకులు, సైన్యం లేని విశ్వామిత్రుడు రెక్కల్లేని పక్షిలా మిగిలి తీవ్రమైన బాధకు లోనయ్యాడు. అన్ని నశించడంతో బాధ చెందిన విశ్వమిత్రుడు నిర్వేదానికి గురై, తనకు మిగిలిన ఒక్క కూమరుడితో 'నీవు ఇక నుంచి ఈ భూమిని పరిపాలించు' అని చెప్పి అడవులకు వెళ్ళాడు.

To be continued .........

No comments:

Post a Comment