Friday 23 May 2014

హిందూ ధర్మం - 64

వెంటనే శబల దుఖిస్తూ కంటతడి పెట్టడం ప్రారంభించింది. ఎంత దీన పరిస్థితి దాపురించింది నాకు. నన్ను రాజు సైనికులు ఈడ్చుకుపోతున్నారు. నన్ను వశిష్టమహర్షి వదిలిపెట్టారా? లేకపోతే నేను మహర్షి పట్ల ఏదైనా ఘోరమైన తప్పు చేశానా? నేను మహర్షి పట్ల ఎప్పుడు భక్తితో ఉన్నాను, ఏ తప్పు చేయనేలేదు. అయినా నాకీ పరిస్థితి ఏంటి? అని ఆలోచిస్తూ శబల తనను వందల మంది సైనికులు లాక్కుని వెళుతున్నా, శక్తి పుంజుకుని వశిష్టమహర్షి పాదాలపై పడింది. బాధతో మూలుగుతు సబల వశిష్టమహర్షితో 'మీరు నన్ను ఎందుకు విడిచిపెట్టారు. నన్ను ఈ రాజు సైనికులు మీ నుంచి వేరు చేస్తున్నారు' అంటూ మొరపెట్టుకుంది.

తన సొంత సొదరితో మాట్లాడిన విధంగా వశిష్టమహర్షి ఆందోళన చెందుతూ శబలతో ఈ విధంగా అన్నారు. నేను నిన్ను విడిచిపెట్టేదిలేదు, నువ్వు నా పట్ల ఏ అపరాధమూ చేయలేదు. ఈ రాజే నిన్ను బలవంతంగా లాక్కువెళుతున్నాడు. నాకు అతనితో సమానమైన బలం లేదు కదా? ఇది కాకుండా అతడు ఇప్పుడు రాజు, కనుక బలవంతుడు, క్షత్రియుడు, ఈ భూమికి రాజు, మనం అతనికి తలవంచాలి, కాదాంటావా? ఈ అక్షౌహిణి సైన్యం నిండా ఏనుగులు, గుర్రాలు, రధాలు, ధ్వజాలు ఉన్నాయి. ఇదే అతని బలాన్ని సూచిస్తోంది అంటూ శబల శాంతి పడేలా మాట్లాడారు.

దానికి బదులుగా శబల ఎంతో వినయంతో 'బ్రహ్మజ్ఞాని! రాజు బలం గొప్పదే. కానీ అది బ్రాహ్మణుని బలం కంటే కాదు. ఋషి రాజు కంటే బలవంతుడు. రాజు బలం ధనం, సైన్యం, ఇతర సంపద. అవి కాలక్రమంలో నశించిపోతాయి. లేదా ఇతర రాజు దండయాత్ర చేసి ఓడిస్తే, మొత్తం పరుల పాలవుతాయి. లేదా మరణంతో నాసిస్తాయి. కానీ తపస్వులకున్న బలం అసమాన్యమైనది. అది దైవానుగ్రహం చేత లభిస్తుంది. భౌతిక సంపద కాలంలో నశిస్తుంది. కానీ ఆధ్యాత్మిక శక్తి కాలంతో పాటు రెట్టింపవుతుంది. ఎంత మంది వచ్చిన, ఎన్ని చేసిన తపోశక్తి చేత వచ్చిన బలాన్ని ఎత్తుకుపోలేరు. దానితో ఏమైనా చేయచ్చు. ఇంత గొప్ప శక్తి కలిగినప్పటికి బ్రాహ్మణుడు తనను తాను నిగ్రహించుకుంటాడు. మీ బలం అసమాన్యమైంది, మీరు విశ్వామిత్రునకంటే గొప్పవారు. మీరు తేజోవంతులు. నాకు ఆదేశం ఇవ్వండి. మీ దగ్గర ఉండడం చేత వచ్చిన శక్తితో ఈ రాజు దర్పాన్ని, బలాన్ని అంతం చేస్తాను. ఇతను చేస్తున్న ఈ దుష్కార్యానికి బదులు చెప్తాను అన్నది.

To be continued ...........

No comments:

Post a Comment