Saturday 31 May 2014

హిందూ ధర్మం - 72 (రాజర్షి విశ్వామిత్రుడు)

దైవమే అన్నిటికంటే గొప్పది. దైవశక్తి ముందు మానవశక్తి ఎందుకూ పనికిరాదు. దైవం వల్ల సర్వం సాధ్యమని నేను నమ్ముతాను. కాదాంటారా? అటువంటి దైవం యొక్క అనుగ్రహం మీ మీద ఆపారంగా ఉంది. మీరే నా కోరిక తీర్చడానికి అర్హులు. నాకు మీరు తప్ప వేరే గతిలేదు, మీరే నాకు శరణు. మానవరూపంలో ఉన్న దైవం మీరు. నా స్థితిని మార్చగలరు అంటూ త్రిశంకు విశ్వామిత్రునితో పలుకుతాడు. దానికి బదులుగా విశ్వామిత్రుడు 'ఓ త్రిశంకు! నువ్వు పరమధార్మికమైన రాజువని నాకు తెలుసు. నువ్వేం బాధపడకు, నీ కోరిక నేను తీరుస్తాను. ఎన్నో పుణ్యకర్మలు చేసిన ఋషులందరిని యాగానికి ఆహ్వానిస్తాను. వారు యాగనిర్వహణలో నీకు సహాయపడతారు. నువ్వు నీ శరీరంతోనే స్వర్గానికి వెళ్ళవచ్చు. నీ పూర్వరూపాన్ని కూడా తిరిగి పొందుతావు. అందరికి ఆశ్రయమిచ్చే విశ్వామిత్రుని వద్ద నువ్వు ఆశ్రయం పొందావు కనుక స్వర్గానికి వెళ్ళడం, చేతితో సులభంగా చేసుకునే పనిగా మారిపోయింది' అంటూ మధురమైన మాటలను పలికాడు. (వశిష్టుడు కుదరదు అన్నాడు కనుక తాను చేసి తీరాలి, అలాగైన వశిష్టమహర్షి మీద ఉన్న కోపం తీర్చుకోవాలి, ఆయనకంటె గొప్ప అని నిరూపించుకోవాలి అనేది విశ్వామిత్ర మహర్షి కోరిక.)

తన కొడుకలను పిలిచి యాగానికి ఏర్పాట్లు చూడమన్నారు. తన శిష్యులందరిని పిలిచి 'వేదం చదువుకున్న ఋషులను, వారి శిష్యులను, వారి మిత్రులను, ఋత్వుకులను, వశిష్టమహర్షి కుమారులను ఆహ్వానించండి' అంటూ ఆదేశాలు జారీ చేశారు. మీరు ఆహ్వానిస్తున్నప్పుడు ఎవరైనా నా మాటలకు విరుద్దంగా మాట్లాడినా, వాళ్ళు పలికిన ప్రతి పలుకు నాకు చెప్పండి. ఇది విన్న శిష్యులు అన్ని దిశలకు వెళ్ళి, ఆయన ఆదేశాల మేరకు అందరిని పిలిచి, ఆశ్రమానికి చేరుకుని, వేదపండితులు ఎవరెవరు ఏం అన్నారో వివరిస్తున్నారు. 'మీ ఆదేశం విన్న తర్వాత వశిష్టపుత్రుడైన మహోదయుడు తప్ప బ్రాహ్మణులందరు యాగ నిమిత్తం బయలదేరారు. వారు కోపంతో చాలా మాట్లాడారు, వారు చెప్పినవన్ని వినండి. 'క్షత్రియుడు యాగం చేయిస్తున్నాడు, చండాలుడు యగం చేస్తున్నాడు, ఇద్దరూ ఏనాడు గురువు దగ్గర వేదం నేర్చుకోలేదు. యాగం చేయించడం వేదం నేర్చుకున్న పురోహితుని కర్తవ్యం. ఈ యాగం వేదవిధికి విరుద్ధంగా ఉన్నందున దేవతలు ఏ విధంగా హవిస్సు తీసుకుంటారు? ఒకవేళ విశ్వామిత్రునికి భయపడి అందరూ హాజరైనా, ఆ యాగం వేదవిరుద్ధం కనుక, అక్కడ ఇచ్చిన అన్నప్రసాదం తీసుకున్నవారు స్వర్గప్రాప్తికి దూరమవుతారు' అంటూ క్రోధం నిండిన కన్నులతో వశిష్టపుత్రులందరూ ఈ మాటలు పలికారని తెలియజేసారు. దీంతో విశ్వామిత్రునికి ఎక్కడలేని కోపం వచ్చింది.  

To be continued ............

No comments:

Post a Comment