Wednesday 28 May 2014

హిందూ ధర్మం - 69 (రాజర్షి విశ్వామిత్రుడు)

వశిష్టునితో దేవతలు, మునులు పలికిన మాటలు విన్న విశ్వామిత్రుడు గట్టిగా ఊపిరి వదులుతూ తనలో తాను ఈ విధంగా అనుకున్నారు.

దిక్ బలం క్షత్రియ బలం బ్రహ్మతేజో బలం బలం
ఏకేన బ్రహ్మదండెన సర్వ అస్త్రాణి హంతిమే

బ్రహ్మతేజస్సు ముందు క్షత్రియ బలం ఎందుకు పనిరాదు. ఒక బ్రహ్మదండం చేత నా అస్త్రాలన్నిటిని ఎదురుకున్నాడు. ఇదంతా చూసిన తర్వాత నేను ఒక నిర్ణయానికి వచ్చాను. బ్రహ్మతేజస్సును ఎదురుకోవడానికి నేను కూడా ఇంద్రియాలను, మనసును నిగ్రహించి, బ్రహ్మర్షిని అవుతాను. అప్పుడు వశిష్టునితో పోరాడతాను అనుకున్నారు.

(ఎంతో గొప్ప క్షత్రియుడు అయినా, కోపంతో మతి తప్పి బలహీనులైన మునులపై, ఆశ్రమంపై, ఆయుధం పట్టని వశిష్టునిపై పోరాటం చేసి, తన ధర్మాన్ని దిక్కరించాడు. సాక్షాత్తు పరమశివుడు ప్రత్యక్షమైతే, వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని మోక్షం అడగకుండా, వశిష్టమహర్షి మీద కోపంతో అస్త్రశాస్త్రం అడిగాడు. పొందిన వరాన్ని సద్వినియోగం చేసుకుని, రాజుగా అస్త్రాలను సరైన పద్ధతిలో ఉపయోగించి ప్రజలను రక్షించాల్సి ఉండగా, అవి వశిష్టమహర్షిపై ప్రయోగించారు. అన్ని అస్త్రాలను వశిష్టమహర్షి నిర్వీర్యం చేసిన తర్వాతైనా బుద్ధి తెచ్చుకుని క్షమాపణ వేడుకున్నారా అంటే అదీ లేదు. ఇంకా శక్తివంతుడినై మహర్షిని ఓడించాలనే పంతానికి పోతున్నాడు. తను కోరింది తనకు దక్కలేదన్న కోపం ఎటువంటి పరిస్థితికి దారి తీసింది. కానీ ఒక మంచి పరిణామం చోటు చేసుకుంది. వశిష్టమహర్షి వంటి మహాపురుషుని దర్శనం కారణంగా నేను కూడా బ్రహ్మర్షి స్థానాన్ని పొందాలనే తపన విశ్వామిత్రునిలో కలిగింది. ఇది మహాపురుషుల యొక్క శక్తి. అందుకే ఎప్పుడైన ఒక మహాపురుషుని దర్శనం చేసుకునే అవకాశం వస్తే, తప్పక వెళ్ళాలి. వారిని దర్శించడం చేతనే, జీవితంలో మంచి మార్పు వస్తుంది.)

జరిగిన సంఘటన బాధపడుతూ విశ్వామిత్రుడు గొప్ప తపస్సు చేయడానికి తన రాణితో కలిసి దక్షిణదిక్కుకు వెళ్ళారు. కందమూలాలు, పండ్లు మాత్రమే తీసుకుంటూ ఘోరమైన తపస్సు చేశారు. ఈ సమయంలో విశ్వామిత్రుడికి హవిస్పంద, మధుస్పంద, ధృఢనేత్ర, మహారథులనే సత్యధర్మ పరాయణులైన నలుగురు పుత్రులు జన్మించారు. సరిగ్గా వేయి సంవస్తరాలు పూర్తయ్యేసరికి లోకాలకు పితామహుడైన బ్రహ్మదేవుడు ప్రత్యక్షమై 'ఓ విశ్వామిత్రా! నీవు తపస్సు చేత రాజర్షి లోకాన్ని పొందావు. అందువల్ల మేము నిన్ను రాజర్షిగా గుర్తిస్తున్నాము' అన్నారు.

To be continued ................

No comments:

Post a Comment