Thursday 8 May 2014

హిందూ ధర్మం - 59 (అక్రోధః)

కోపం రావడానికి మూలం కామంలోనే ఉంది. మనం అనుకున్నది మనకు దక్కకపోతే కోపం వస్తుంది. అది ఆహారమైనా, వస్తువైనా, సుఖమైనా, ఇంకేదైనా కావచ్చు.  ఈ పని ఈ సమయానికి, ఇలా అయిపోవాలి, ఇదిలా జరిగిపోవాలని కొన్ని ప్రణాలికలు సిద్ధం చేసుకుని, దానికి అనుగుణంగా ప్రవర్తిస్తాం. కానీ కాలం ఎప్పుడు ఒకేలా ఉండదు. కొన్ని సార్లు మనమెంత ప్రయత్నించినా, అనుకున్న పనులు అనుకున్న సమయానికి సక్రమంగా పూర్తికావు. అన్నీ సజావుగానే సాగినా, ఏదో అవాంతరం అనుకోకుండా ఏర్పడి చికాకు కలుగుతుంది. ఇది క్రోధానికి బీజం వేస్తుంది. పనులు సక్రమంగా జరగకపోవడానికి ఎవరో ఒక వ్యక్తి లేదా సమూహమే కారణమని కోపాన్ని ఇతరుల మీదకు నెట్టి వేస్తుంది మనసు. ఫలితంగా వ్యక్తి ఇతరులను కోపగించుకుని, నానా మాటలు అంటాడు మనిషి.

మనిషి తనకంటే గొప్పదైన శక్తి ఒకటి ఈ సృష్టిలో ఉందని, ఈ సమస్త జగత్తు దానికి లోబడే పని చేస్తోందనే సంగతిని మర్చిపోవడం వల్లనే ఈ పరిస్థితి ఏర్పడుతోంది. 'అన్నీ మనం అనుకున్నట్టే జరగవు. అన్నీ మనం అనుకున్నట్టే జరిగితే ఇక దేవుడనే వాడు ఎందుకు గుర్తుంటాడు. అప్పుడప్పుడు అనుకున్నవాటికి భిన్నంగా జరుగుతాయి. అప్పుడే మానవుడికి అర్దమవుతుంది, తనను మించిన శక్తి ఒకటి లోకంలో ఉన్నదని, అప్పుడు దైవం అనే వాడు గుర్తుకువస్తాడు' అనే ఈ మాటశ్రీ రాముడు అన్నాడు రామాయణంలో. దైవం ఉన్నదని, ఈ సమస్త జగత్తు దైవశాసనాన్ని అనుసరించే నడుస్తోందని మనం నమ్మినప్పుడు, మనం అనుకున్న సంకల్పం నెరవేరకపోవడానికి కారణం కూడా ఆ భగవత్ సంకల్పమే అన్న భావన స్థిరంగా ఉంటుంది. మనకు ఏది మంచి చేస్తుంది, అది మాత్రమే దైవం ప్రసాదిస్తుంది, దైవానికి అన్నీ తెలుసు అని నమ్మడమే భక్తి. అనుకున్నది ప్రాప్తించకపోవడానికి కారణం కూడా దైవ శాసనమే అన్న భావన మనలో కలిగినప్పుడు ఇక కోపం అన్నది రానేరాదు.

మనిషిని మాయ కప్పేస్తోంది. తానే శక్తివంతుడిననీ, తనను మించిన వారు లేరని అహకారం ఈ మాయ నుంచి వస్తుంది. దాంతో దైవాన్ని మర్చిపోతున్నాడు. బహుసా దైవానికి ఈ పని ఇప్పుడు జరగడం ఇష్టం లేదేమో, అందుకే ఇలా అర్ధాంతరంగా ఆగిపోయిందని అనుకుంటాడు భక్తుడు. మన ప్రయత్నాలన్నీ మనం చేయాలి, సర్వశక్తులు ఒడ్డి కృషి చేయాలి, కానీ ఎన్ని చేసినా, పైవాడు అంగీకరించనిదే ఏదీ జరగదని నిజం గుర్తించినప్పుడు ఇక ఎవరి మీద కోపగించుకునే అవకాశం ఉండదు.

To be continued.........

No comments:

Post a Comment