Saturday 3 April 2021

కంచి పరమాచార్య స్వామి వారి అమృత వచనాలు - గణపతి (221)



మంచిగా ఉండడానికి భక్తి అవసరం లేదని కొందరంటారు. నిజమాలోచిస్తే అనేక స్వార్థాలతో కూడిన జీవునికి శుద్ధి, భక్తి వల్లనే సాధ్యమౌతుంది. యుగయుగాల నుండి, పై వాడొకడున్నాడని, అతడన్నింటిని గమనిస్తున్నాడని, మనం చేసే మంచి చెడ్డలకు ఫలాన్నిస్తాడనీ నమ్మకంతో బ్రతికాం. అట్టి భావన ప్రజలకు ఆలంబనంగా, ఊరట నిచ్చేదిగా ఉంటుంది. ధర్మమార్గంలో నడవడానికి దోహదం చేసింది.


భక్తి యొక్క లక్ష్యం మనిషిని మంచిగా తీర్చిదిద్దడానికే. ఇక పరమార్ధ జ్ఞానం పట్టుబడితే పై వాడికి తనకూ అభేదాన్ని గుర్తిస్తాడు. ఇక జనన మరణ ప్రవాహమూ ఉండదు. బాధా విముక్తి కల్గుతుంది. జ్ఞానం కలిగి ప్రవర్తిస్తే తనకూ, సంఘానికి సేవ చేసినట్లే. గుళ్లు, గోపురాలు కట్టడం ఎందుకంటారు, అవి ఎంతో ఎత్తుగా ఉంటాయి. మనలనూ ఉన్నతంగా తీర్చిదిద్దడానికి అవి ఉన్నాయి. ఉన్నతంగా మనమున్న రంగాలలోనూ ఎదగాలని సూచిస్తున్నాయి. 


ఐదు ఇంద్రియాలు - ఐదు ఉపచారాలు


మనిషిలో విషయాలననుభవించడానికి బదు ఇంద్రియాలున్నాయి. కన్ను, చెవి, ముక్కు, నోరు, చర్మం. వీటిని పంచేంద్రియాలంటారు. ఇవి శబ్ద, స్పర్శ, రూప, రస, గంధాలనే విషయాలను అనుభవిస్తున్నాయి. కన్ను రూపం చూస్తోంది. నాల్క రుచిని ఆస్వాదిస్తోంది. చర్మం వల్ల స్పర్శ జ్ఞానం కల్గుతోంది. ఈ ఇంద్రియాలు క్రొత్తగా వేటినీ సృష్టించడం లేదు. అవి ఉన్న వాటిని అనుభవిస్తున్నాయి. రేడియో, విద్యుదయస్కాంత తరంగాలను గ్రహిస్తున్నట్లుగా ఉన్న వాటినే మెదడునకు చేరుస్తున్నాయి. క్రొత్త వాటిని సృష్టించి ఈయవు. సృష్టిలో ఉన్నవాటిని చూసి, స్పృశించి బుద్ధికి విషయాన్ని చేరవేస్తాయి. వీటినే జ్ఞానేంద్రియాలంటారు. చేతులు, కాళ్లు మొదలైనవి పనులను చేస్తాయి, కనుక వాటిని కర్మేంద్రియాలంటారు. నాల్క రుచి చూడడంతో బాటు అనగా జ్ఞానేంద్రియమే కాకుండా మాట్లాడునపుడు నాదాన్ని పుట్టించి కర్మేంద్రియంగానూ ఉంటుంది.


No comments:

Post a Comment