Sunday, 4 April 2021

కంచి పరమాచార్య స్వామి వారి అమృత వచనాలు - గణపతి (222)



పంచ భూతాలున్నాయి. అవే ఆకాశం, వాయువు, అగ్ని, నీరు, భూమి ఇవి విశ్వశక్తులు. ఇవి జ్ఞానేంద్రియాలకు ఆధారం. నాదమే ఆకాశంలో ఉంటుంది. చాలా మంది ఒక చోట గుమిగూడినపుడు రకరకాల ధ్వనులున్నా 'ఓ' అనేది సామూహికంగా వినిపిస్తుంది. సముద్ర ఘోషలోనూ 'ఓ' ఉంది. శంఖాన్ని చెవిదగ్గర పెట్టినప్పుడూ ఇట్టినాదం వినిపిస్తుంది. 'ఓ' కి చుక్కబెడితే దేవ నాగరలిపిలో ఓం. ఇట్లా ఈ నాదం వినబడుతూనే ఉంటుంది. గాలిలో ఈ నాదం వినబడడమే కాకుండా గాలికి స్పర్శ గుణం ఉంటుంది కూడా. గాలి మన మీద ప్రసరింప బడినపుడు అది ఉండని తెలిసికొంటాం కదా. దానికి తోడు అగ్నికి రూపం కూడా ఉంది. కళ్లతో చూస్తున్నాం, నీటికి పై వాటికి తోడు రుచి యుంది. నాల్కపై వేసికొని రుచి చూస్తున్నాం కదా! పై వాటికి తోడు భూమికి వాసన కూడా ఉంది. ఇందన్నీ మొలకెత్తుతాయనీ తెలుసు. ఇట్లా చూడడం, వినడం, రుచి చూడడం, స్పృశించడం, వాసన చూడడం జరుగుతోంది. 

ఇట్లా ఐదు ఇంద్రియాలూ మనం అన్నిటినీ అనుభవించడానికి కారణమౌతున్నాయి. మంచి ఆహారం, మధుర సంగీతం, సువాసన, చల్లని గాలి, అందమైన చంద్రోదయ దృశ్యం. అన్ని ఈ ఇంద్రియాల వల్లనే అనుభవిస్తున్నాం. వీటికి ఆధారాలైన పంచభూతాలను భగవానుడందించాడు. అతని దయవల్ల మనం భోగాలను అనుభవిస్తున్నాం. మనంతట మనం ఒక్క బియ్యపు గింజను సృష్టించలేం. అతని దృష్టిని తిలకించి పులకించండని ఐదు ఇంద్రియాలను ప్రసాదించాడు. వీటిని అనుభవించేటప్పుడు వీటి కారకుణ్ణి స్మరించడం మన కర్తవ్యం కదా!


ఈ విషయాలను ముందుగా భగవానునకు నివేదించి మరల స్వీకరించడం, దానిని ప్రసాదంగా భావించడం మన విధి. ఇట్టి భావనతో ఉంటే మన మనస్సునకు పరిపక్వత లభిస్తుంది. ఏదీ అర్పించకుండా స్వీకరించకూడదనే భావన మనలో నాటుకోవాలి.


అంటే పంచేంద్రియాల ద్వారా స్వామికి పంచోపచారాలు చేసి స్వీకరించాలన్న మాట. చాలా ఉపచారాలున్నా ఇంట్లోగాని, ఆలయంలోగాని కనీసం ఈ ఐదు ఉపచారాలను చేయాలి. అనగా స్వామికి గంధం అర్పించుట పువ్వులతో పూజించుట, ధూపం చూపించుట, దీపారాధన, నైవేద్యాలు అర్పించాలి. ఇందు గంధం సమర్పించడాన్ని భూమికి; పువ్వు - ఆకాశానికి; ధూపం - వాయువునకు; దీపం - ఆగ్నికి; నైవేద్యం - నీటికి (అమృతానికి) గుర్తులు. ఇట్లా పంచభూతాలు, పంచోపచారాలలో దాగియున్నాయి. పంచ భూతాలనుండి అన్ని వస్తున్నాయి. పంచేంద్రియాలు అనుభవిస్తున్నాయి. దీని వల్ల జీవుడు, దేవుడు, ప్రపంచం అన్నీ ఒక్క చోట కలుస్తున్నాయి.

No comments:

Post a Comment