Tuesday, 6 April 2021

కంచి పరమాచార్య స్వామి వారి అమృత వచనాలు - గణపతి (224)ఇట్టి ఆచారాలు లోపించకుండా కొనసాగించడం మంచిది. నామ సంకీర్తన లేకుండా భజన మందిరాలు బోసిపోకూడదు. ఇటీవల కాలంలో దినదినాభివృద్ధి పొందడం చూస్తూ ఉంటే శుభసూచకంగా కన్పిస్తోంది. వేద ఆగమ, అచారాలు క్రమక్రమంగా లోపించే సమయంలో కనీసం ఇట్టి సంప్రదాయమైనా బ్రతికి ఉండడం హర్షింపదగిందే. అట్లాగే సత్సంగాలు బాగా పనిచేస్తున్నాయి. అట్లా భజనలూ సాగడం మంచిది.


నామసంకీర్తన భక్తి పోషకమైనది. దీనిని వ్యాప్తిలోనికి తెచ్చిన ఘనత సద్గురు బోధేంద్ర స్వామి వారికి చెందుతుంది. ఆయన పరమాత్మ సచ్చిదానందరూపుడైనా జగత్కల్యాణం కోసం అవకార రూపంలో వచ్చాడని, ఈ మూర్తులే సరిపోవని, హరి, శివ నామాలను ధరించి వచ్చాడని అట్టి మంగళ రూపునకు జయమగుగాక యని కీర్తించారు. అనగా భగవన్నామాలు వట్టి నామాలు కావు. మూర్తితో బాటు అవీ భగవత్ స్వరూపములే అని అర్థం వస్తోంది కదా! భగవానునకు ఎట్టి శక్తి ఉందో నామానికీ అంత శక్తి ఉన్నట్లే కదా మహాత్ములు గానం చేసి పుణ్యం సంపాదించిన పాటలను, పద్యాలను మనం పాడితే వారు భగవద్దర్శన్నాన్ని పొందినట్లుగానే మనకూ అట్టి భాగ్యం కల్గుతుంది. జయదేవుడు, నారాయణ తీర్థులు, రామదాసు, పురందరదాసు త్యాగరాజు వ్రాసిన పాటలు, అట్లే తమిళ భక్తుల పాటలు, హిందీలోని భక్తి గీతాలు, మరాఠీలోని అభంగాలు - వీటినన్నిటినీ సంప్రదాయంగా వచ్చే భజన సంగీతంలో అమర్చినవాడు, మరుదానల్లూర్ సద్గురుస్వామి. డోలోత్సవం, వసంత కేళి మొదలగు ఉత్సవాలలో పాడేవీ ఉన్నాయి. ఎట్టి శ్రమలేకుండా సంగీత శాస్రాభ్యాసం లేకుండా ఆనందంగా అందరూ పాడేవి. కలియుగంలో తీవ్రసాధనలు చేయడం కష్టమని, నామసంకీర్తన వలనే ముక్తిని పొందవచ్చని భాగవత గ్రంథమే చెప్పింది: కలౌ సంకీర్త్య కేశవం:


సామూహికంగా పాడే భజన పద్ధతిని అట్లా ఉంచండి. ప్రతి గృహంలో ఇంట్లో ఉన్నవారందరూ కలిసి భజనలు చేయవచ్చు కదా! దానికి ఎక్కడకో వెళ్లాలనే కష్టమూ ఉండదు కదా! పూజా మందిరంలోగాని, విడిగా గాని అందరూ కలిసి ఒక దీపం వెలిగించి చూట్టూ చేరి కొంతసేపు, భజన చేయవచ్చు కదా! నామ సంకీర్తనం చేయడమేమిటని సిగ్గుపడకండి. సంగీత జ్ఞానం లేకపోయినా, గాత్ర మాధుర్యం లేకపోయినా భక్తి కలిగియుండడమే ప్రధానం. ఆడుకొనే పాపాయి అమ్మ అంటూ తల్లి దగ్గరకు వెళ్లడం లేదా? రాగయుక్తంగా ఆ మాటను పలుకుతున్నానా, అని ఆ పిల్ల ఆలోచిస్తోందా? అట్లాగే మనమూ లోకమాతను పిలవాలి. ఎన్ని పనులు చేస్తున్నా రామాది నామాలను కీర్తించాలి. అదే మన అసలైన సంపద. అందువల్ల సుఖశాంతులు కల్గుతాయి.

No comments:

Post a comment