Friday, 9 April 2021

కంచి పరమాచార్య స్వామి వారి అమృత వచనాలు - గణపతి (226)



నేను చేస్తున్నాననే అహంకారం పోయినపుడు అదే సరియైన నమస్కారం. అది అన్నివేళల చేయవలసిన నమస్కారం. ఆ అనుభవం చటుక్కున రాదు అయినా ఆలయంలోనైనా వినయంతో నమస్కారం చేయగలగాలి. అది దేనిని సూచిస్తుంది. నేను నా బాధ్యతనంతా నీ మీద నుంచాననే. కొంత బాధ్యత మనకుందని ఎప్పుడైతే భావించామో అపుడు భగవానుడు తన బాధ్యతను తగ్గించుకొంటాడు. ఇక్కడ అసంపూర్ణత్వం కన్పిస్తోంది కదా! కనుక అంతా నీ బాధ్యతే అనగలగాలి. మంచి జరిగినా, చెడు జరిగినా అంతా నీ సంకల్పాన్ని అనుసరించే జరుగుతుందని భావించగలిగితే సర్వార్పణ భావంతో ఉండగలిగితే అపుడతడు మనపై దయ చూపిస్తాడు. మన భారాన్నంతలటినీ తానే స్వీకరిస్తాడు. ఇక మన నెత్తిమీద బరువుండదు.


భక్తి


ఒకానొక మహాశక్తి యొక్క తెలివే (మహత్తు) ఈ విశ్వం, సమస్త జీవులుగా కన్పిస్తోంది. ఈ కన్పించడం ఎప్పుడైతే పోయిందో మిగిలేది మహత్తే , ఆసమష్టి బుద్ధియే. ఆ స్థితిలో ఏ క్రియలేదు. విశ్వంగా కనబడడం వల్లనే, ప్రాణులుగా కన్పించడం వల్లనే క్రియలన్నీ ఉన్నాయి. వీటిని దాట గలిగితే ఆ మహత్తుతో ఐక్యం కావచ్చు. అదే బ్రహ్మ సాక్షాత్కారం. అదే అపరోక్ష సాక్షాత్కారం. అదే జీవాత్మ యొక్క సహజమైన, మార్పులేని స్థితి.


No comments:

Post a Comment