Wednesday, 7 April 2021

కంచి పరమాచార్య స్వామి వారి అమృత వచనాలు - గణపతి (225)



నమస్కారం


పరమేశ్వరుని ఉద్దేశించి ఒక చక్కని శ్లోకం ఉంది. దానిని వ్రాసినవాడు గొప్ప భక్తుడు, గొప్ప విద్వాంసుడైన అప్పయ్య దీక్షితులు.


ఓ త్రిపుర సంహార! నేను రెండు తప్పులు చేసినందులకు క్షమించుమయ్యా. ఏమిటో తప్పులంటావా? గత జన్మలో నీకు నమస్కారం పెట్టియుండను. వచ్చే జన్మలో పెట్టే అవకాశమూ లేదు. నేను గత జన్మలో నమస్కారం పెట్టలేదని నాకెట్లా తెలిసిందంటావా? నమస్కారం పెట్టకపోవడం వల్లనే నాకీ జన్మ వచ్చింది కదయ్యా! గత జన్మలో పెట్టియుంటే ఏనాదో ముక్తి లభించియుండేది. ఈ జన్మే వచ్చి యుండేది కాదు. వచ్చే జన్మలో చేయలేనని అన్నాను. ఎందుకంటావా? ఈ జన్మలో నీకు నమస్కరించేను కదయ్యా కనుక ఇక జన్మ ఉండదు. ఇక జన్మే లేనపుడు నమస్కారం పెట్టడం కుదరదు కదా! కనుక గత జన్మలో పెట్టనందులకు, రాబోవు జన్మలో ఆ అవకాశం. లేనందులకు ఈ రెండు తప్పులను క్షమించు తండ్రీ! అని వేడుకొన్నారు.


ఏ సందేశమిచ్చింది ఈ శ్లోకం? భగవానునకు హృదయపూర్వకంగా నమస్కారం పెట్టాలనే. అపుడే జననమరణ ప్రవాహం నుండి అతడు తప్పిస్తాడు. ఇదేదో కవితా చమత్కారం కోసం వ్రాసేడని భావించకండి. భక్తిలో మునిగి వ్రాసిన శ్లోకమిది. కనుక శరణాగతిని పొంది హృదయపూర్వకంగా నమస్కరించాలి. సద్గతి తప్పక కల్గుతుంది. సందేహించనవసరం లేదు.


(ఈ దిగువ విషయం 'నమోనమః'లో స్వామివారు చర్చించారు. చూడండి అమృతవాణి-2)

నమస్కారం ఎట్లా చేయాలి? దండ నమస్కారం చేయాలి. చేతి నుండి జారిన దండం, చేతిని విడిచి నేలమీద పడిపోతుంది. అట్లాగే ఈ శరీరం నాది కాదు, ఇది భగవానునిదే అనే భావనతో నేల మీద పడడమే దండ నమస్కారం. మన శరీరం కర్ర వంటిడే. దీనిని ఎత్తడం, నిటారుగా నిలబడడం చేసేది లోనున్న శక్తియే. నేను దీనిని నిలుపుతున్నానని, దీనితో పనులు నిర్వహిస్తున్నాననే ఆహంకారాన్ని విడిచి దండం మాదిరిగా నేల మీద పడాలన్న మాట. అదే దండ నమస్కారం. జ్వరంలో మన శరీరం నిలబడలేదు నడవలేదు. అసలు పుట్టుకే ఒక పెద్ద జ్వరం. ఇట్టి జ్వరం ఎందుకు వచ్చిందో తెలిసికొని, ఇది మరల రాకుండా ఉండడం కోసం దండం మాదిరిగా భగవానుని ముందు మోకరిల్లాలి.

No comments:

Post a Comment