Tuesday 13 April 2021

కంచి పరమాచార్య స్వామి వారి అమృత వచనాలు - గణపతి (231)



భక్తివల్ల ప్రపంచ సమస్యలు క్రమక్రమంగా తొలగిపోతాయి. మన బుద్ధి వికసించి, ఏ సమస్యలను పట్టించుకోని స్థితి ఏర్పడుతుంది. అటూ ఇటూ తిరిగే మనస్సును కట్టగలం. ఏకాగ్రత లభిస్తుంది. తద్ద్వారా సుఖశాంతులు వర్ధిల్లుతాయి, ఇట్లా శాశ్వతమైన అఖండమైన ప్రేమను పరమేశ్వరుని పట్ల చూపించగలిగితే మన కర్మలూ క్రమక్రమంగా క్షీణిస్తాయి. జనన మరణ భ్రమణం నుండి స్వామి, మనలను తప్పిస్తాడు. అతడే నేనయ్యాననే పరిపక్వమైన బుద్ధి మనకు కలిగినపుడు అట్టి మానసిక స్థితిని గమనిస్తాడు. అప్పుడు అనుగ్రహవర్షాన్ని కురిపిస్తాడు. ఇట్లా అనేక కారణాల వల్ల భక్తిని అభ్యసించాలి.


ఏ కారణమూ లేని భక్తిని గురించి ఆలోచించండి.


కారణం లేకుండా భక్తిని అభ్యసించుట


అనేక కారణాల వల్ల భక్తినభ్యసించినా ముక్తి కోసం భక్తియనుట ఉత్తమమైనది. ఆదిశంకరుల అభిప్రాయం ప్రకారం జ్ఞానం వల్లనే తిన్నగా మోక్షం లభిస్తుంది. కేవలం ఈశ్వరారాధన వల్ల కాదని సిద్ధాంతం. ముక్తి అంటే ఏమిటి? విడుదల కావడం, దీనినే తమిళంలో వీడు అంటారు. దేని నుండి విడుదల? ప్రపంచ జీవితం నుండి విముక్తి. అనగా పుట్టుకలు, చావుల నుండి, సహజ రూపాన్ని గుర్తించడం ముక్తి. మనస్సున్నంత వరకూ సంసార బంధంలో చిక్కుకోవడం తప్పదు. మనస్సు అణగినపుడు మాత్రమే ఇది సిద్ధిస్తుంది. ఎంతవరకూ నామ రూపాలున్నాయో అంతవరకూ మనస్సు ఆకర్షింపబడుతూ ఉంటుంది. మనం భక్తిని అభ్యసిస్తే ఈశ్వరుని రూపం, ఈశ్వర గుణాలే కన్పిస్తాయి. అట్టి భక్తిలో కూడా సంయోగం, వియోగాలుంటాయి. ఎప్పుడు మనస్సు పూర్తిగా లీనమై పోయిందో అప్పుడట్టివి అనుభవంలోకి రావు. అనగా మార్పులేని ఆనంద స్థితి రావాలన్న మాట. అఖండ శాంత స్థితి, ఏది ఆత్మ, ఏది మనస్సునకు ఆధారమని అన్వేషించేది జ్ఞాన మార్గంలోనే. ఇట్లా అన్వేషణలో మనస్సు లీనమైనప్పుడు చివరగా ఈశ్వరకృప వల్ల మనస్సు మటుమాయమైపోతుంది. ఆత్వస్వరూపం అవగతమౌతుంది. దానినే ముక్తియని అంటారు.

No comments:

Post a Comment