Saturday, 10 April 2021

కంచి పరమాచార్య స్వామి వారి అమృత వచనాలు - గణపతి (228)



ప్రపంచంలో మంచి-చెడు; అందం-అందవికారం; సంతోషం-దుఃఖం అన్నీ బ్రహ్మము నుండి వచ్చినవే. ఎప్పుడైతే జీవాత్మ, పరమాత్మతో ఐక్యమయ్యిందో పై ద్వంద్వాలలో తేడా ఏమీ కనబడదు.


మనమున్న పరిస్థితులలో అట్టి స్థితి పట్టుబడడం కష్టమే. ఈ దశలో ఈశ్వరుని బహు సుందరమూర్తిగా, ఆనంద స్వరూపునిగా భావించి ప్రేమించ గలగాలి. ఈ దశలో నిర్గుణుడైన పరమాత్మను ధ్యానించలేం. కాని అన్ని గుణాలూ గుణరహితుడైన బ్రహ్మమునుండే వచ్చాయి. రంగులేని సూర్యకాంతి ఒక ఫలకం గుండా అనగా చదునైన ప్రక్కలు గల కడ్డీ (ఫ్రిస్మ్) గుండా ప్రసరించినపుడు ప్రతిబింబం ద్వారా భిన్నమైన రంగులను చూడడం లేదా అట్లాగే మాయ అనే అద్దం గుండా నిర్గుణ బ్రహ్మం ఈశ్వరుడవుచున్నాడు. గుణాలు కలిగిన వానిగా కన్పిస్తున్నాడు. గుణ రహితమైనది ప్రాథమిక దశలో పట్టుబడదని చెప్పాను. కానీ గుణాలు కలిగినవానిని చింతించగలము. చెడ్డ గుణాలను భావిస్తే అధోగతే. ప్రపంచంలో మునిగిపోతాం. కనుక మంచి గుణాలనే భావించగలగాలి. కనుక పరమేశ్వరునకు ఒక రూపం ఉందని, జీవం ఉందని, కల్యాణ గుణాలతో ఉంటాడని భావించాలి. అట్లా భావిస్తే అతనికున్న కల్యాణ గుణాలూ మనకు సంక్రమిస్తాయి. అంతా భావనయే.


మనం నిరంతరంగా, తీవ్రంగా దేనిని భావించినా అదే మనమౌతాం దీనిని మనస్తత్వ శాస్త్రజ్ఞులు అంగీకరించారు. కనుక దోషాలు లేని, దయా సముద్రుని నిరంతరం చింతించగలిగితే మనమూ ప్రేమమూర్తులం కాగలం. అంతా ప్రేమమయమై చెడ్డ పనులు చేయడానికి అవకాశం ఉండదు. పాపకృత్యాలు పాపచింతనలు లేకుండా ఉండాలంటే భక్తికి మించిన్ది లేదు. ఇందువల్ల భక్తి సామ్రాజ్యంలోనే అడుగుపెట్టమనీ అనడం లేదు. ఇట్టి భావన మన సహజస్థితికి తీసికొని వస్తుంది. అదే మన లక్ష్యం. మనస్సు ఎప్పుడైతే ఆగిపోయిందో ఆత్మకాంతి ప్రస్ఫుటమై మనస్సులోని సమస్త కర్మవాసనలూ మటుమాయమై పోతాయి. కనుక పాపాన్ని సమూలంగా పెకలించడానికి భక్తి యొక్క అవసరం ఎంతైనా ఉంది.


No comments:

Post a Comment