Wednesday, 21 April 2021

కంచి పరమాచార్య స్వామి వారి అమృత వచనాలు - గణపతి (239)



ఊడుగు చెట్టని ఒక చెట్టుంది. పక్వంకాని పండు నేల మీద పడితే అది బ్రద్దలౌతుంది. వెంటనే అందలి గింజలు ఏదో శక్తి తీసికొని, వెళ్లినట్లుగా చెట్టు మొదట్లో చేరుతాయి. చెట్టును పట్టుకొని గింజ మాయమవుతుందట. ఎక్కడి నుంచి వచ్చిందో అక్కడకు చేరుతుందట. అంటే చెట్టులోనే ప్రవేశిస్తుంది. అట్లాగే భగవానుని నుండి వచ్చిన మనము అతని వైపు పయనించి అతట్టి పట్టుకొని అతనిలో ప్రవేశించాలి, ఏకం కావాలి. రెండవ ఉదాహరణ - సూది, సూదంటు ఱాయికి ఆకర్షింపబడడమే కాకుండా, చివరకు అట్టి సూదికీ ఆకర్షించే లక్షణం వస్తుంది. ఆ సూది కూడా ఇతర ఇనుప పదార్థాలను ఆకర్షించగలదు. అనగా భక్తునకు భగవల్లక్షణాలు సంక్రమిస్తాయి. శక్తి వస్తుంది. మూడవది, పతివ్రత - భర్త గురించి, పతివ్రత యొక్క సంభాషణ, పనులు, తలపులు అన్నీ భర్తను గురించే. అట్లాగే భక్తుడు తన మనస్సును, వాక్కును క్రియను భగవంతుని గురించే యుండాలని సూచిస్తున్నాడు. మూల శ్లోకంలో పతి' అని లేదు. విభుడని ఉంది. అనగా భగవంతుణ్ణి ఒక్కచోటనే ఉన్నాడని భావించకుండా అన్ని చోట్ల ఉన్నాడని (విభువని) భావించాలని సూచించారు. తరువాత లతలు. చెట్టు నుండి విడదీసినా కొంత సేపటికి లత, ఆ చెట్టును చుట్టుకొంటుంది. అట్లాగే మనకు ఎన్ని కష్టాలు వచ్చినా మన మనస్సు భావాలూ అతనివైపే ప్రసరించాలని సూచించారు. ఈశ్వరుడే లక్ష్యమన్న మాట. చివరగా నదులు - సముద్రము. ఇదే అద్వైత భావన, సముద్రం నుండే వర్షం వస్తోంది. (సూర్య కిరణాలు - ఆవిరి - మేఘంగా మారుట - వర్షం) అది నది అవుతోంది. కనుక సముద్రానికి, నదికి భేదం లేదు. నది కొండకొమ్ముపై పుట్టి సంతత గమనంతో చివరకు సముద్రాన్ని చేరుతోంది. తన అస్తిత్వాన్ని కోల్పోతోంది. అనగా దాని ఊరు, పేరు పోగొట్టుకుంటోంది. సముద్రం ఎదురేగి స్వాగతం పల్కుతోంది. అందువల్లనే నదులు, సముద్రంలో కలిసే చోటునకు ముందుగా నది నీరు కూడా ఉప్పగా ఉంటోంది. అట్లాగే నిజమైన భక్తిని చూపిస్తే భగవానుడు దయతో చేతులు చాస్తాడు. కౌగలించుకొంటాడని సూచన.


మొట్టమొదట భక్తి, వ్యాపారధోరణిలో సాగినా, డబ్బు కీర్తి రావాలని భక్తుడు తహతహలాడినా, భగవానుని కల్యాణ గుణాలను చింతించిన కొలదీ ఏ కోరిక లేక అతణ్ణి కోరుతాం. చివరకు నిర్గుణ బ్రహ్మానుభవం సిద్ధిస్తుంది. అతనిలో లీనమైపోతాము. అతడేయైపోతాం.


ప్రపంచ జీవితాన్ని సరిగా నడపాలన్నా, ద్వైత, విశిష్టాద్వైత, అద్వైతానుభవం రావాలన్నా భక్తి, తప్పనిసరి. మోక్ష సాధన సామగ్రిలో భక్తి శ్రేష్టమైనదని శంకరులన్నారు. అట్లా అంటూ తనను తానగుట (స్వ స్వరూపానుసంధానం) భక్తియని సెలవిచ్చారు కూడా.


మోక్షసాధన సామగ్ర్యాం భక్తి రేవ గరీయసీ 

స్వ స్వరూపాను సంధానం భక్తి రిత్యభిధీయతే


No comments:

Post a Comment