Sunday 11 April 2021

కంచి పరమాచార్య స్వామి వారి అమృత వచనాలు - గణపతి (229)

 


భక్తి, దేని కోసం ?


ప్రతి కార్యానికి ఒక కారణం ఉంటుంది, నేటి భౌతిక శాస్త్రమూ దీనినంగీకరిస్తుంది. ప్రపంచం అంతా ఒక క్రమ పద్ధతిలో నడుస్తోంది. ఇట్లా నడవడానికి ఒక సమష్టి మనస్సు (Cosmic Mind) కారణం. అతని చేతిలో నియమాలున్నాయి. మనమూ మామూలు జీవితంలో కార్యకారణ సంబంధాన్ని అడుగడుగునా చూస్తున్నాం. ఏ పని చేసినా తగిన ఫలం వస్తోంది. మంచి పనులు చేస్తే మంచి ఫలం, చెడ్డ పనులు చేస్తే చెడ్డ ఫలాలూ సిద్ధిస్తున్నాయి. భావానుగుణంగా ఫలప్రాప్తి, ఈ మంచి చెడ్డ ఫలాల నిచ్చేవాడొకడుండాలి, అనగా ఫలదాత. అతడే తన మహాశక్తి ద్వారా జగన్నిర్వహణను కొనసాగిస్తున్నాడు. అతణ్ణి ఏ పేరుతో పిలిచినా సరే.

మనలో మనస్సెంత వరకూ ఉందో అంతవరకూ ఆందోళనలు తప్పవు. మంచిచెడులు రెండూ ప్రాప్తిస్తూ ఉంటాయి. పుణ్యపాపాలను రెంటినీ చేస్తున్నాం. పాపాలవల్ల బాధలు కల్గిస్తాడు. సాధారణంగా ఈ బాధల నుండి విముక్తికై ప్రార్ధిస్తూ ఉంటాం. ఇట్లా భావించడమే భక్తియని సాధారణంగా భావిస్తూ ఉంటారు. భగవానుడు కోరితే బాధలు మనకుండవనే మాట వాస్తవం. కాని అతడట్లా కోరడానికి మనకున్న అర్హత ఏమిటి? అందువల్లనే మంచి చెడులకు తగిన ఫలాలనందిస్తాడు. అంటే మన కర్మలను బట్టే. కనుక మనకెట్టి మానసిక స్థితి ఉండాలి? కష్టాలు వచ్చినా తట్టుకొనే స్థితినిమ్మని ప్రార్థించాలి. అయినా ఇట్టి వేడికోలూ సరియైన భక్తియని అనిపించుకోదు.

మనం, మన బాధలను అతని ముందు ఏకరవు పెడుతున్నామంటే అతనికి ఇవి తెలియవని అనుకొంటాం. కాని అవి అతనికి తెలియవా? ఈ కష్టాలను తొలగించు, నా మానసిక స్థితిని మార్చు, అని అడిగినా అవి అతనికి తెలియవనే గట్టి నమ్మకంతో ఉంటాం. అంటే అతని దయను తక్కువ చేసి చూపిస్తున్నాం. ఇది భక్తి అవుతుందా?

No comments:

Post a Comment