Monday 12 April 2021

కంచి పరమాచార్య స్వామి వారి అమృత వచనాలు - గణపతి (230)

అయితే అట్లా విన్నవించుకోవడం వల్ల మన బాధలను కొంత ఉపశమనం కలిగి, కొంత బరువు తీరినట్లుగా కనిపిస్తోంది కదా! ఏదో కొద్దిపాటి శాంతి లభిస్తోంది. కొంత వినయం కల్గుతోంది. అదైనా కొంతవరకు చాలు, మనం అతణ్ణి తక్కువగా అంచనా వేయడాన్ని క్షమిస్తాడు. మన కర్మల భారాన్ని తొలగించగలడు. కాని, ఈ మానవ జీవితంలో ఒక సమస్య తీరినా అంతటితో ఆగిపోతోందా? మరొకటి పొంచి యుంటుంది. దీనికి అంతం అంటూ ఉందా ?


కనుక భక్తి అంటే శరణాగతియే. జరిగేవి జరుగుతాయనే దృఢసంకల్పం ఉండాలి. తనకోసం తానేమీ కోరకుండా ఉండగలిగితే దుమ్ములేని అద్దంలా అతని మనస్సు ప్రకాశిస్తుంది. అప్పుడే శాంతి, నా కోసం నేనేమి అడగనంటూ ఒకరికి ఒకరు శరణాగతిని పొందినా బాధలుండవు. అది భార్య, భర్తకైనా, శిష్యుడు గురువుకైనా సరే అట్టి అంకిత భావం, సర్వార్పణ భావం మోక్షానికి దారి చూపిస్తుంది. పురాణాలలో భార్య, భర్తకు, శిష్యుడు గురువునకు అంకితమైన ఘట్టాలున్నా, నిత్య జీవితంలో లోపాలున్న వారిపట్ల శరణాగతి కుదురుతుందా? మనలోపాలూ వారిలో కన్పిస్తున్నాయి కదా! సరియైన సద్గురువు లభిస్తే అట్టిపై శరణాగతి చూపించగలిగితే, అన్నీ నీవే, అంతా నీవే, ఏదీ నాది కాదు అని త్రికరణ శుద్ధిగా భావించగలిగితే శాంతి లభిస్తుంది.


భక్తినెందుకు చూపించాలో మరొక మాట చెబుతాను, జీవితంలో ప్రేమ లేకుండా ఉంటే మనకు శాంతి ఎక్కడ? అయితే ఈ ప్రేమ ఫలం కనబడడం లేదు. మనం ఎవరిని ప్రేమించినా ఏదో ఒకనాడు వియోగం కల్గుతోంది. ఏ ప్రేమ సంతోషాన్ని ఇంతకు ముందు ఇచ్చిందో అదే దుఃఖాన్నిస్తోంది. ఈశ్వరుడు ఒక్కడే శాశ్వతుడు. కనుక మన ప్రేమను అతని వైపు మళ్లించ గలిగితే అతడు శాశ్వత సుఖాన్నిస్తాడు. నిష్కలంకమైన ప్రేమను చూపగలిగితే అంతా అతనిగానే కన్పిస్తుంది. అట్లా కాకుండా ఒకని పట్ల ప్రేమ చూపించితే, అది ద్వేషంగా కాలాంతరంలో మారవచ్చు. కనుక అంతటా నిండిన వానిపట్ల ప్రేమ చూపించగలగాలి. అంతటా నిండిన వాడని ఎప్పుడైతే భావించామో ఇక ఎక్కువ తక్కువలు కనబడవు. కనుక ప్రేమలేని జీవితం నిష్ఫలం.


No comments:

Post a Comment