Thursday 1 April 2021

కంచి పరమాచార్య స్వామి వారి అమృత వచనాలు - గణపతి (219)




ఆలయం - వైద్యాలయం


మానవ సేవయే మాధవసేవ కనుక ప్రత్యేకంగా మాధవుణ్ణి సేవించనవసరం లేదని కొందరంటారు. అంతేకాదు, ఆలయాలను వైద్యాలయాలుగా, విద్యాలయాలుగా మార్చండని కేకలు వేసేవారూ ఉన్నారు. రోగాలను కుదర్చడం, విద్యాబుద్ధులు నేర్పడం ప్రశంసింపదగినవే. అట్టి సాంఘిక కార్యక్రమాలు భగవత్ కృపకు నోచుకొంటాయనడంలో సందేహం లేదు. మానవ సేవయే మాధవ సేవ అనడంలోనూ తప్పులేదు. మాధవుణ్ణి సేవించినా మానవులందరినీ సేవించినట్లే అంటున్నా. ఇది సంఘ సేవకంటే శాశ్వతమైన మంచిని ప్రసాదిస్తుందని అంటున్నా. ఎట్లా?


వైద్యాలయంలో రోగాలు కుదిర్చి ఇంటికి పంపుతున్నారు. తరువాత అతడు సక్రమ జీవితం గడుపుతాడని నమ్మకం ఉండా? రోగాలు కుదర్చబడిన వారు ఘోరకృత్యాలు చేస్తే మనం రోగం కుదర్చడం వల్ల ఫలమేమైనా వస్తుందా? ఎవరైనా మతిస్తిమితం లేని వాళ్లను దగ్గరకు తీసికొని వచ్చి రోగం కుదుర్చండని ప్రాథేయపడుతూ ఉంటారు. పై విధంగా భావిస్తూ ఉంటాను. కుదిరినా సరిగా నడుచుకొంటాడా లేదా అని నేను వారిని ప్రశ్నిస్తే వారు బాధపడుతారు కదా! కనుక అట్లా పైకి అనను. ఇట్లా ఉంటుందని చెప్పడానికే ఇదంతా చెప్పాను. ఏదైనా తప్పు పని చేస్తే తగిన దుష్ఫలితం వస్తుందని భావించి చేసినా పాపమే వస్తుంది. అయితే మతిస్తిమితం లేనివాడు తప్పు పని చేసినా వాడికి పాపం అంటదు. గత జన్మ పాపాలవల్ల ఇప్పుడీ రోగం వచ్చింది. ప్రస్తుతం అట్టి వానికి పాపం లేదు. అట్లా ఉండడానికి ఏది మూలకారణం? ఈ జన్మలో పాపాలు చేయకుండా ఉండాలన్నా, గత జన్మలోని పాపాల నివృత్తికి మార్గమేమిటి?


No comments:

Post a Comment