Friday 23 April 2021

కంచి పరమాచార్య స్వామి వారి అమృత వచనాలు - గణపతి (241)



తమ తమ మనఃప్రవృత్తులకు, ప్రీతికి అనుగుణంగా ఒక్కొక్క దేవతా మూర్తిని ఇష్టపడుతూ ఉంటారు. ఒక పిల్లవాడు, తల్లిని సమీపించినట్లుగా ఒక భక్తుడు అమ్మవారిగా చింతిస్తాడు. పరమశాంతి కావాలని కోరుకొనేవాడు దక్షిణామూర్తిని ధ్యానిస్తాడు. నృత్యగీతాలతో దేవుడిని సంతృప్తి పరచాలని ఒకడు భావిస్తే అతడిని కృష్ణునిగా కొలుస్తాడు. కనుక తమ ఇష్టాన్ని అనుసరించి ఒక మహాశక్తిని ఒక్కొక్కమూర్తిలో భావిస్తాడు. ఆ మూర్తి జీవంతో, దయతో తొడికిసలాడుతున్నట్లుగా భావిస్తాం. శుష్కమైన రూపంతో ఉన్నాడని భావించం. ఇట్లా మన మనఃప్రీతిని బట్టి ఆరాధన సాగుతోంది. అందరినీ ఒక దేవతనే పూజించండని మన మతం చెప్పదు. అందొక స్వేచ్ఛ దాగియుంది. మొదట మన ఇష్టదేవతను భజించినా మనకీ ప్రత్యేక మనఃప్రవృత్తి ఉందేమిటని ప్రశ్నించుకొని అన్నిటిని పరమాత్మగా భావించే మనఃప్రవృత్తిని ఆ మూర్తియే మనలో కల్గిస్తాడు.


మనమొక దేవతను ఇష్టపడి ఎట్లా ఆరాధిస్తున్నామో, ఇతరులు కూడా వారి వారి ఇష్టాలననుసరించి పూజిస్తున్నారు. కనుక ఇతర దేవతలు తక్కువ వారని, మన దేవతయే ఎక్కువని భావించకూడదు. మనకెట్లా మన మూర్తి కోరికలను తీరుస్తున్నాడో వారికీ వారి మూర్తులు అనుగ్రహం చూపిస్తున్నారని భావించాలి. అయితే ఒక సందేహాన్ని కొందరు వెలిబుచ్చుతూ ఉంటారు. ఏమిటనగా పురాణాలలో ఫలానా దేవత ముఖ్యుడని, ఇతర దేవతలు తక్కువ వారనీ ఉంది. ఈ దేవత చేతిలో మిగతా దేవతలు ఓడింపబడినట్లుంది కదా అని ప్రశ్నిస్తారు. దీని నెట్లా అర్థం చేసికోవాలి? సంస్కృతంలో నహినిందా న్యాయమని ఒకటుంది. 


పురాణకర్తల తాత్పర్యం, ఇతర దేవతలను నిందించడం కాదు, తానిష్టపడిన దేవతను ప్రశంసించడమే. ఎందుకిట్లా ఉంది? తానిష్టపడే మూర్తీ పట్ల అచంచల విశ్వాసం కలగడం కోసం, ఏకాగ్రత సిద్ధింప చేయడం కోసం, నిందా వాక్యాలున్నట్లు కన్పిస్తాయి. అభీష్టపడే మూర్తి శక్తిమంతుడని, అట్టి శక్తి ఇతరదేవతలకు లేదని చెప్పడం అందుకే.


పూర్వకాలంలో ప్రసిద్ధులైన వ్యక్తులు సమస్త దేవతలను ఒకే విధంగా భావించారు! కాళిదాసు, బాణుడు వంటి కవులు ఒకే మూర్తి భిన్న భిన్నంగా అవతరించిందనే వ్రాసారు.

భక్తుల మనఃప్రవృత్తులను అనుగుణంగా భిన్న భిన్న ఆకారాలలో కనపడడమే కాదు, ఆ దేవతలు చేసే పనులూ ఒక్కొక్క గుణాన్ని ఆధారంగా చేసికొని యుంటాయి. సృష్టించేటపుడు బ్రహ్మ రజోగుణాన్ని ఆధారంగా చేసికొన్నాడు. సత్త్వ గుణంతో ఉన్నపుడు విష్ణువుగా కన్పిస్తాడు. సంహరించే సమయంలో తమో గుణాన్ని శివుడు స్వీకరిస్తాడు. లేదా ఆశ్రయిస్తాడు. ఒకే ఒక శక్తి, త్రిమూర్తులుగా కన్పిస్తోందని కాళిదాస కవి అన్నాడు. ఈ ముగ్గురికీ ఏది నప్పుతుందో మిగతా దేవతామూర్తులకూ ఇదే అనువర్తిస్తుంది.


కనుక ఒక దేవత గొప్ప, ఒక దేవత తక్కువ అని కీచులాడడం తగదు. అయినా మానవ మనఃప్రవృత్తుల వికారాల వల్ల వీరశైవులూ, వీరవైష్ణవులు గత కాలంలో పోట్లాడుకొన్నారు. ఆ మహావిష్ణువు, ఆ మహాదేవుడైన శివుడు ఒక్కరే కదా.

No comments:

Post a Comment