మనమేం చేస్తున్నాం? నిజరూపాన్ని విస్మరించాం. ముసుగుతో కూడియున్నాం. మనకు దగ్గరవారిని విడిచినపుడు ఎంతో బాధపడతాం. కాని స్వరూపాన్నే మనం విస్మరించడం వల్ల ఎంత బాధపడాలో ఆలోచించండి. మన నిజమైన ఆనందంలో ఎప్పుడు లీనమౌతామని తహతహలాడగలగాలి. పరమాత్మతో కూడాలనే ఆందోళన ఉన్నపుడే నిజమైన ప్రేమ పెల్లుబుకుతుంది. అట్టి ప్రేమనే భక్తియని యంటారు.
దీనికై పూజ, ఆలయాల సందర్శనం మొదలు మొట్టమొదట సాగాలి. ప్రపంచ వ్యవహారాలలో మునిగి తేలేవారికి పరమాత్మను చింతించడానికై తప్పక ఉపకరిస్తాయి. ఇట్టి స్థితిలో స్వామి ఆలయంలోనే ఉండడు, అంతటా ఉంటాడనే భావన గాని యుండకపోవచ్చు. అతడు మూల విగ్రహంలో ఉన్నాడని ఇట్టి దశలో భావించినా తప్పులేదు. ప్రసాదం తినివేసి ఏ స్తంభాలకో చేతులను పులుముతూ ఉంటారు. అరెరె! స్వామి లోపల ఉన్నాడు, మనమీ పనిని చేస్తున్నామేమిటని భయం పుడుతుంది. కనుక దేవుడు లేదని అనడం కంటే ఆ మాత్రం భయమున్నా చాలు. అట్టి భయభక్తులే మనలను క్రమక్రమంగా ఉన్నతులుగా తీర్చిదిద్దుతాయి. రానురాను అంతటా స్వామి ఉన్నాడనే భావన కల్గుతుంది. రానురాను అనుభవం పాకాన పడిన కొద్దీ నాది నాకిమ్ము అని అడుగుతాం. అనగా స్వస్వరూపాన్ని గుర్తించేటట్లు అనుగ్రహించుమని ప్రార్థిస్తాం. జ్ఞానాంబిక అట్టి అనుగ్రహాన్ని భక్తులపై ప్రసరించుగాక!
No comments:
Post a Comment