Tuesday, 20 April 2021

కంచి పరమాచార్య స్వామి వారి అమృత వచనాలు - గణపతి (238)



శంకరుల అభిప్రాయం - భక్తి లక్షణాలు


ఈశ్వరుణ్ణి భక్తితో సేవించి, ఇద్దరూ ఒక్కటే అని చింతిస్తూ, అభిన్నులని గాఢంగా భావిస్తూ ఉండే అద్వైత జ్ఞానులెందరో ఉన్నారు. మధుసూదన సరస్వతి, అప్పయ్య దీక్షితులు, సదాశివ బ్రహ్మేంద్రులు, భగవన్నామ బోధేంద్రులు మొదలైనవారు జ్ఞానులై యుండి భక్తి సామ్రాజ్యంలో ఓలలాడేవారు. నిర్గుణ బ్రహ్మమునకు, కల్యాణ గుణాలతో ఉన్న సగుణ బ్రహ్మకు భేదాన్ని చూడలేదు. మధుసూదన సరస్వతి ఇట్లా అంటారు: ఏది నిర్గుణము, ఏది నిష్కలమో దోషరహితమో దానిని యోగులు ధ్యానించనీయండి కాని నేను నీలమేఘశ్యాముడైన, యమునా నదీ సైకతాలలో విహరించే గోపాలకృష్ణుని ధ్యానిస్తాను. అన్ని రూపాలూ పరమేశ్వరుని రూపాలే, అంతా ఒక్కటే అని జ్ఞానులు భావిస్తారు. వారు జ్ఞాన నిష్ఠులైనా ఏదో ఒక మూర్తిపై మక్కువ కలిగియుంటారు. అనగా భక్తి తాత్పర్యంతో కూడి యుంటారు. చిన్నతనంలోనే వారి కట్టి ప్రీతి ఉదయించి యుండవచ్చు.


శంకరులే దేవతను నుతించినా అందరినీ బ్రహ్మముగానే భావించి స్తోత్రాలు చేసారు. శివానందలహరిలో చాలా అందంగా భక్తిని నిర్వచించారు.


అంకోలం నిజబీజసంతతి రయస్కాతోపలం సూచికా


సాధ్వీనైజవిభుం లతాక్షితిరుహం సింధుస్సంద్వల్లభం


ప్రాప్నోతీహ యథాతథా పశుపతేః పాదారవిందద్వయం


చేతో వృత్తి రు పేత్య తిష్ఠతి సదా సాభక్తి రిత్యుచ్యతే


అనగా ఊడుగు గింజలు, వాని యంతట అవే ఆ చెట్టు మొదలునెట్లు పట్టుకొంటాయో, సూదంటు ఱాయిని సూది ఎంత గట్టిగా పట్టుకొనియుంటుందో, పతివ్రత తన విభుణ్ణి ఎడబాయకుండా అనుసరిస్తూ ఉంటుందో, తీగ తనంతట తానే చెట్టును పెనవేసికొని యుంటుందో, నదులు తమంతట తామే సముద్రంలో ఎట్లా కలుస్తున్నాయో అట్లాగే మనస్సు అన్నివేళలా పరమేశ్వరుని పాదారవిందాలను పట్టుకొని అక్కడినుండి తొలగకుండా ఉండదమే భక్తియని పెద్దలంటారు.


No comments:

Post a Comment