Wednesday 14 April 2021

కంచి పరమాచార్య స్వామి వారి అమృత వచనాలు - గణపతి (232)



భక్తిని అభ్యసించిన కొలదీ, ముక్తికి చేరువౌతావని, ముక్తి లభిస్తుందని గోపాలకృష్ణ భారతి కీర్తించాడు. అంటే ఇతరులన్నట్లు ఏ కైలాసానికో, ఏ వైకుంఠానికి వెడతావని అనలేదు, మనమే మనుకొంటాం? ఏ దేవతను ఉపాసిస్తే అతడుండే కైలాస్తానికో, వైకుంఠానికి వెడతామని భావిస్తాం. దీనినే ద్వైత విశిష్టాద్వైతులు నొక్కి చెప్పారు. అయినా ఆ లోకాలలో కూడా భక్తుడు వేరు, భగవానుడు వేరనే భావన ఉండనే ఉంటుంది. ఈశ్వరానుభవమని, తనను భావిస్తున్నానని, తన కంటే మరొకడున్నాడనే భావనలు అక్కడా ఉంటాయి.


కాని అద్వైతముక్తి పై దానికి భిన్నం. గోపాలకృష్ణ భారతి, అద్వైతి శంకరులు కూడా జ్ఞానమే ముక్తినొసగేదని అన్నారు. అట్లా చెప్పినా ఆ శంకరులే అనేక స్తోత్రాలను వ్రాసేరు. అనేక క్షేత్రాలను దర్శించారు. అనేక తీర్థాలలో మునిగారు. షణ్ముత స్థాపన చేశారు. ఈ మఠంలోనూ గంటల కొద్దీ పూజ జరుగుతూ ఉంటుంది.


ఆత్మ స్వరూపం మనస్సునకు అవగతం కాదు. అసలు మనస్సే ఆత్మ నుండి వచ్చింది. అట్టిది ఆత్మను కొలవడమేమిటి? మనస్సు పోయినప్పుడే కదా ఆత్మ ప్రకాశం. అయితే మనస్సు నానా తిరుగుళ్లు తిరుగుతోంది. దీనిని తిరగకుండా చేయాలి. అందువల్ల భక్తిని ఒక సాధనంగా ఇక్కడ చెప్పారు. ఈశ్వరునిపై ఎప్పుడు లగ్నమైందో మనస్సు అతనితో కలుస్తుంది. ఆ లగ్నం కావడం ఎప్పుడు? ఒక కుండలో నూనెపోసి దానికొక చిల్లుపెడితే నిరంతరం ప్రవహించునట్లుగా సంతత ధార ఉండాలి. (తైలధారవత్ అవిచ్ఛిన్న ధారా ప్రవాహమని విద్యారణ్యులు, పంచదశిలో అన్నారు) ఎప్పుడట్టి ఏకాగ్రత సిద్ధించిందో మనస్సు తెరమరుగౌతుంది. ఇట్లా భక్తి, జ్ఞానానికి దోహదం చేస్తుంది. కనుక భక్తిని ఒక మెట్టుగా శంకరులు భావించారు.


No comments:

Post a Comment