Wednesday, 1 September 2021

శ్రీ హనుమద్భాగవతము (29)



మెల్లమెల్లగా హనుమంతుడు 'విద్యాధ్యయనమునకు తగిన వయస్సు గలవాడయ్యాడు, కాని ఇతని అల్లరి మాత్రం అలాగే ఉండింది. తల్లిదండ్రులు కూడా చాలా చింతితులయ్యారు. వారు తమ ప్రియపుత్రునుకు ఎన్నో విధాలుగా బోధించారు, ఎన్నో విధాలుగా యత్నించారు. కాని అతడు తన అల్లరిని మానలేదు. ‘చివరకు అంజనా దేవి, కేసరి ఋషుల దగ్గరకు వెళ్ళారు, ఋషులు కూడా తమ కష్టగాథలను వారికి తెలియజేసారు. ఆ దంపతులు వినయపూర్వకముగా ఋషులకు ఇలా విన్నవించుకొన్నారు. “ తపోధనులారా! మాకీ బాలుడు ఎన్నో దినములు పిమ్మట కఠోర తపఃప్రభావముచే లభించినాడు. మీరు ఇతన్ని అనుగ్రహించండి. విద్యాసంపన్నుడయ్యేటట్లు ఇతనిని ఆశీర్వదించండి. మీ దయ వలన ఇతని స్వభావము మారవచ్చు. దీనులమైన మమ్ము - కరుణించండి.” 


'ఇతనికి అమితమైన తన బలపరాక్రమములన్నా గర్వము మెండుగానున్నది. తన బలమును మర్చిపోతే ఇతనికి యథార్థమైన మేలు కలుగుతుందని ఋషులు తలంచారు.


'ఈ బాలుడు దేవతలకు హితమును చేకూర్చగలడు, భగవానుడైన శ్రీరామచంద్రునకు అనన్య భక్తుడవుతాడు. అనుగతుడగు భక్తునకు బలాహంకారం ఉన్డుట ఉచితము కాదు, దీనభావముతోనే ప్రభువునకు సేవ చేయగలుగుతాడు’ అని కొందఱు వయోవృద్ధులైన ఋషులు భావించారు.


ఈ కారణముతో భృగువు యొక్క అంగిరసుని యొక్క వంశములలో జన్మించిన ఋషులు హనుమంతునిట్లు శపించారు – 'వానరవీరా! నీవే బలమును ఆశ్రయించి మమ్ము బాధించుచున్నావో దానిని మా శాపముచే మోహితుడవై బహు కాలము మఱచిపోతావు. నీ బలమును గూర్చి నీవేమీ తెలుసుకోలేవు. ఎవరైన నీ కీర్తిని గుర్తుకు తెచ్చినపుడు నీ బలము పెరుగుతుంది.'*


* బాధ'సే యత్ సమాశ్రిత్య బలమస్మాన్ ప్లవంగమ ॥ 

తద్ దీర్ఘ కాలం వేత్తాసి నాస్మాకం శాపమోహితః | 

యదా తే స్మార్యతే కీర్తి స్తదా తే వర్ధతే బలమ్ || (వా. రా. 7-86-34, 35)


No comments:

Post a Comment