Monday, 13 September 2021

స్వానందలోకం - ఇతరలోకాలు



బహుదేవతారాధనయే సనాతనధర్మం యొక్క ప్రాణం, సౌందర్యం. ఇష్టదేవతనే పరబ్రహ్మంగా, మిగిలిన దేవతలను అంశలుగా ఉపాసించి, మోక్షం పొందే మార్గాన్ని సనాతన ధర్మం చూపింది. శైవులకు కైలాసం ఉత్కృష్ట లోకం కాగా, వైష్ణవులకు వైకుంఠం, శాక్తేయులకు మణిద్వీపం చేరుట లక్ష్యాలు. అలాగే గణేశోపాసకులకు స్వానందలోకం చేరుట పరమలక్ష్యం. 


గాణాపత్యాన్ని అనుసరించి స్వానందలోకం మధ్యలో ఉంటుంది. అందులో సిద్ధి బుద్ధి సమేతుడైన గణపతి ఉంటాడు. స్వానందలోకానికి తూర్పున వైకుంఠం, దక్షిణాన కైలాసం, పశ్చిమాన మణిద్వీపం, ఉత్తారాన జ్ఞానమార్గం ఉంటాయి. అందుకే గణపతి ఉపాసనలో గణపతికి తూర్పున లక్ష్మీనారాయణులను, దక్షిణాన శివపార్వతులను, పశ్చిమాన రతీమన్మధులను, ఉత్తరాన భూదేవి వరహాస్వామి వారిని ప్రతిష్టించి ఉపాసిస్తారు. గణేశుడు మధ్యలోనున్న పూర్ణబ్రహ్మం, ఆదిమూలం. ఇంకా గణపతికి అంగదేవతలు, అనేకమంది పరివార దేవతలు చుట్టూతా ఉంటారు. లక్ష్మీనారాయణులు ధర్మానికి, శివపార్వతులు అర్ధానికి, రతీమన్మధులు కామానికి, వరహాస్వామిభూదేవులు మోక్షానికి సంకేతాలు. అనగా గణాపతి ఒక్కడిని గట్టిగా పట్టుకుంటే నాలుగు పురుషార్ధాలు వస్తాయి. భౌతికమైన సుఖాలు కలుగుతాయి, ఆధ్యాత్మిక గమ్యం నెరవేరుతుంది. అంటే ఆదిశంకరులు ప్రతిపాదించిన పంచాయాతనం అన్నమాట.


భూస్వానందంలో అనగా మోర్గావ్ క్షేత్రంలో సైతం గణపతికి నాలుగు దిక్కులా పైన చెప్పుకున్న నలుగురు దేవతలు కొలువై ఉంటారు. లక్ష్మీనారాయణులు వైష్ణవానికి, శివపార్వతులు శైవానికి, రతీమన్మధులు శక్తేయానికి సంకేతాలు కాగా భూదేవి-వరహా స్వామి వారు సౌరానికి; యోగ, జ్ఞాన మార్గాలకు సంకేతాలు. అంటే అన్ని మతాల పరమలక్ష్యం గణేశుడే అని సారం. మీరు ఏ మార్గంలో వెళ్ళినా, చివరకు గణపతినే చేరతారు. ఇక్కడొక ప్రత్యేకమైన విషయం ఏమిటంటే బౌద్ధం, జైనం వంటి అవైదిక, నాస్తిక మతాలు కూడా ఉత్తరభాగంలోనే ఉంటాయని గాణాపత్య ఆగమాలు చెబుతున్నాయి. అందుకే గణేశోపాసన అవైదిక, నాస్తిక మతాల్లో సైతం ఉన్నది. బౌద్ధులు, జైనులు కూడా గణాపతిని పూజిస్తారు. ఇలా గాణాపత్యం ఏ ఒక్క మతాన్ని తిరస్కరించక, అందరూ దేవతలను, అన్ని మార్గాలను సత్యమని అంగీకరిస్తూ పూర్ణబ్రహ్మమైన గణేశుడిని చేరే మార్గం చూపెడుతుంది. 


ఓం శ్రీ గణేశాయ నమః 

No comments:

Post a Comment