Saturday 25 September 2021

పితృకర్మల్లో శ్రద్ధ మరియు మంత్రం ప్రధానం



పితృకర్మల్లో శ్రద్ధ మరియు మంత్రం ప్రధానం. కర్మ చేయించే బ్రాహ్మణుడు అపరకర్మలు చేయడంలో నిష్ణాతుడై ఉండాలి. అతడు చదివే మంత్రాల వల్లనే తర్పణాదులను పితృదేవతలు స్వీకరిస్తారు. పితృకర్మలను అపరకర్మలు అంటారు. వీటిని చేసే బ్రహ్మణులకు కూడా ప్రాయశ్చిత్తం విధించబడింది. వేలకు వేలు డబ్బులు తీసుకుంటున్నారని చాలామంది ఆరోపిస్తుంటారు. కానీ మనం అర్ధం చేసుకోవలసింది ఒకటుంది. పితృకర్మ చేయడానికి వచ్చే బ్రాహ్మణుని ఒంటి మీదకు పితృదేవతలు వస్తారు. అందుకే భోక్తలు చాలా ఎక్కువగా తింటారు. అలా తింటారని వారికి కూడా తెలీదు. పితృకర్మ చేసి ఇంటికి వెళ్ళిన తర్వాత దానికి ప్రాయశ్చిత్తంగా అతడు సహస్రగాయత్రి చేయాలి. ప్రాయశ్చిత్తం చేయని పక్షంలో ఆ బ్రాహ్మణుడు అనేక సమస్యలను ఎదురుకొంటాడు. విమర్శ చేసేవాళ్ళకి తెలిసింది కొంచమే, కానీ అపరకర్మలు చేసే బ్రాహ్మణుల జీవితంలోకి తొంగి చూస్తే అప్పుడు తెలుస్తుంది, అది ఎంత శక్తివంతమైన విషయం అనేది. రెండవది, పితృకర్మ చేసిన బ్రాహ్మణునకు సంతృప్తిగా భోజనం పెడితే, ఆ ఇంటి పితరులు సంతోషిస్తారు, ప్రేతశాంతి కలుగుతుంది. 


అయితే కేవలం బ్రాహ్మణుడు నిష్ణాతుడై ఉంటే సరిపోదు. కర్మ చేయించుకునేవారు కూడా శుచీశుభ్రత, పితృకర్మల యందు భక్తి, విశ్వాసాలు కలిగి ఉండాలి. బ్రాహ్మణుడు సక్రమంగా మంత్రం చదివినా, చేయించుకునేవారికి శ్రద్ధ లేకపోతే పితరులు ఆ పిండాలను, తర్పణాలను స్వీకరించరు. ఆ కుటుంబాలను శపిస్తారు. 


కొందరికి వీలుపడదని వేరొకరితో పిండప్రధానాలు చేయిస్తారు. ఇది కూడా శాస్త్రం అంగీకరించదు. కర్మ చేసే అధికారం కర్తకు మాత్రమే ఉంటుంది. కర్త అనగా ఎవ్వరు శాస్త్రం ప్రకారం తల్లిదండ్రులకు కర్మ చేసే అధికారం గలవాడు. అది వెరొకరి ఇవ్వలేరు. కొన్ని ప్రత్యేక సందర్భాల్లో తప్ప అన్ని వేళలా శాస్త్రం దాన్ని అంగీకరించదు. కనుక డబ్బులిస్తామూ కర్మ చేయండి అని అనకండి, వీలు కల్పించుకుని మరీ పితృపూజ చేయండి.

No comments:

Post a Comment