Thursday, 9 September 2021

శ్రీ హనుమద్భాగవతము (37)



తుదకు బ్రహ్మ దేవుని ఆజ్ఞానుసారముగా వారు స్నాతక మహోత్సవమునకు వచ్చారు. కాని వారు అరిభయంకరరూపములను ప్రదర్శింపసాగారు. వారి భీకరాకారములను చూసి దేవాంగనలు భయపడి హాహాకారములు చేశారు. అపుడు లీలావతారుడైన శ్రీ ఆంజనేయుడు మహాకాలసన్నిభమైన తన వాలముతో యమధర్మరాజును బంధించి గగనానికి ఎత్తినవాడై, లోకాలయందు త్రిప్పుతూ పరమపదాన్ని చూపాడు.


"పరంధామమును చూసిన యమధర్మరాజు పరమానందభరితుడై గర్వాన్ని వీడీ "శ్రీహరిహర స్వరూపుడైన శ్రీ ఆంజనేయుని అనేక విధాల స్తుతించాడు. శ్రీ ఆంజనేయస్వామి తన వాలముతో శనైశ్చరుని తలపై మోదగా ఆయన అధో ముఖుడయ్యాడు. శ్రీ ఆంజనేయుడు సాక్షాత్తుగా భగవంతుడని గ్రహించి గర్వాన్ని వీడి శనైశ్చరుడు అనేక విధముల స్తుతించాడు. శ్రీ యమధర్మరాజు, శ్రీ శనైశ్చరుడు ఆంజనేయునితో 'జగద్రక్షకా! నీ నిజస్వరూపమును "తెలిసికొనలేక 'అజ్ఞానులమై గర్వించాము, 'అహంకరించాము. 'మమ్ములను క్షమించు. 'సర్వగుణసంపన్ను'రాలు, మహాశక్తి స్వరూపిణీ అయిన మా సహోదరిని పరిణయమాడి, మమ్ములననుగ్రహించు. భక్తజనమందారా! నీ నామస్మరణము చేయు నీ భక్తులను మేము ఏమాత్రము పీడింపము. మేము వారికి ఆయురారోగైశ్వర్యములను ప్రసాదిస్తాము. - ఇది సత్యము' అని పలికారు. ఆ ప్రదేశంలో గల వారందరు యమధర్మరాజ శనైశ్చర గర్వభంగమును చూసి పరమాఃశ్చర్యచకితులై శ్రీ ఆంజనేయుని అనేక విధముల స్తుతించారు.


శ్లో॥ జ్యేష్ఠశుద్ధ దశమ్యాం చ భగవాన్భాస్కరో నిజాం | 

సుతాం సువర్చలాం నామ పాదాతీత్యా హనూమతే ॥


జ్యేష్ఠ శుద్ధ దశమి యందు శుభముహూర్తమున శ్రీసూర్యభగవానుడు తనకుమార్తె అయిన సువర్చలా దేవిని శ్రీ ఆంజనేయునకు కన్యాదానం చేశాడు. ఆ సమయములో సప్తఋషులు వధూవరుల ప్రవరలను ఇలా పలికారు.


శ్రీ ఆంజనేయ ప్రవర 

ముత్తాత అంగిరసుడు 

తాత మరీచుడు 

తండ్రి వాయుదేవుడు

కౌండిన్యగోత్రము


శ్రీ సువర్చలాదేవి ప్రవర 

ముత్తాత బ్రహ్మదేవుడు 

తాత కశ్యపప్రజాపతి 

తండ్రి శ్రీ సూర్య భగవానుడు 

కాశ్యప గోత్రము


ఆ సమయమందు పుష్పవృష్టి కావించిరి. ఆనక దుందుభులను మోగించారు. బ్రహ్మాదులు అనేక విధాల స్తుతించారు. గంధర్వులు గాన మొనరించారు. అప్సరసలు నృత్యములను చేశారు. కిన్నెర కింపురుషాదిగా గల వారందరూ జయజయ ధ్వానాలు చేశారు.


No comments:

Post a Comment