Friday 3 September 2021

శ్రీ హనుమద్భాగవతము (31)



అంజనా దేవి శ్రీ రామావతారకథను చెప్పడం ఆరంభించినపుడు బాలుడైన హనుమానుని మనస్సు అంతా పైకథ యందే లగ్నమై ఉండేది. ఆ సమయంలో నిద్రా దేవి అతనిని ఆవహించేది కాదు. తల్లికి కునుకు వస్తే అతడామెను పట్టుకొని ఊపుతూ 'అమ్మా! ఇంకా చెప్పు, చెప్పు. తరువాత ఏమి జరిగినదని అడుగుతుండేవాడు'.  


తరువాత మళ్ళి తల్లి చెప్పేది. శ్రీ రామకథా శ్రవణము వలన హనుమానునకు తృప్తి కలుగకపోయేది. మాటిమాటికి శ్రీరామునికథను వినిపించమని అతడామెను నిర్బంధించేవాడు. అంజన మహోల్లాసపూర్వకంగా కథను వినిపించును, హనుమంతుడు దానిని తన్మయత్వముతో వినుచుండును. ఆ సమయమున అతని నేత్రములు అశ్రుపూర్ణములయ్యేవి, శరీరమంతా కపించిపోతుండేది. నేను ఖూడా ఆ హనుమానుడనే అయితే ఎంత బాగుండెదో అని అతను అన్కొనేవాడు.


కథను వినిపిస్తూ అంజనా దేవి కుమారుని నాయనా! నీవు కూడా అట్టి హనుమంతుడవు అవుతావా' అని అడిగేది. ‘తప్పకుండ ఆ హనుమంతుడనే అవుతానమ్మా' అని హనుమానుడు సమధానమిచ్చెడివాడు. 'కాని ఆ శ్రీ రాముడు రావణుడు ఎక్కడున్నారు! రావణుడు జననియైన సీతా దేవి పై దృష్టి వేసినచో నేను వానిని నలిపివేస్తానని చెప్పేవాడు. అంజనా దేవి ఇలా పలికేది - "కుమారా! నీవు ఖూడా ఆ హనుమానువే అవ్వు. ఇప్పటికీ 'లంక'లో రావణుడు రాజ్యము చేస్తున్నాడు. అయోధ్యాధిపతియైన దశరథునకు పుత్రునిగా శ్రీరాముడవతరించినాడు. నీవు త్వరగా పెద్దవాడివికమ్ము. శ్రీరామునకు సాహాయ్యపడుటకు నీవు త్వరగా బలపరాక్రమసంపన్నుడవు కమ్ము.” . 


'అమ్మా! నాలో శక్తికి లోటేమున్నదీ అని పలికి హనుమంతుడు రాత్రియందు మంచం మీది నుండి క్రిందకు దూకి, తన భుజములను చూపి తల్లి ఎదుట తాను అమితశక్తిశాలినని నిరూపించుకొనేవాడు. అంజన నవ్వుతూ తన ప్రియపుత్రుని ఒడి లోనికి తీసుకుని వీపు నిమురుతూ మధురస్వరముతో ప్రభువు గుణెములను గానము చేస్తూ నిద్రబుచ్చుచుండేది. హనుమంతుడు అంజనా దేవి ఒడిలో సుఖంగా నిద్రించుచుండేవాడు. సహజమైన అనురాగముతో హనుమానుడు మాటికి శ్రీరాముని కథను వినుచుండేవాడు. అట్లు వింటూ అతడు మాటిమాటికి శ్రీరాముని స్మరించుకొనుచుండేవాడు. తత్ఫలితముగా అతనికి శ్రీరామస్మరణము ముందుముందు తీవ్రంగా కాసాగింది. మెల్లమెల్లగా అతని సమయములో ఎక్కువ భాగము శ్రీరాముని ధ్యానంలోనూ, స్మరణములోను గడచిపోయేది. అతడొకప్పుడు అరణ్యమునందు, మఱియొకప్పుడు పర్వతగుహలోను, ఒకప్పుడు నదీతటమునందును, ఇంకొకప్పుడు దట్టమగు పొదరింటిలోను ధ్యానస్థుడయ్యేవాడు, అతని నేత్రములనుండి ప్రేమాశ్రువులు ప్రవహించుచుండెడివి.


No comments:

Post a Comment