Monday, 27 September 2021

పితృకార్యాలు చేయకపోతే ఏమవుతుంది?



స్వకులం పీడయేప్రేతః పరచ్ఛిద్రేణ పీడయేత్|

జీవన్స దృశ్యతే స్నేహీ మృతో దుష్టత్వమాప్నుయాత్|| - గరుడ పురాణం


ఈ శ్లోకం అర్థం ప్రతి ఒక్కరూ ఒక పలక మీద వ్రాసి నిద్రలేవగానే కనిపించే విధంగా పెట్టుకోవాలి. గరుడ పురాణంలో శ్రీమహావిష్ణువు చెప్పిన సత్యం ఇది. కడుపులో పెట్టుకొని పెంచి పెద్దచేసి ప్రాణాలు పోయిన తరువాత కూడా ఇంటి చూరట్టుకొని వేళ్ళాడిన పితరులను నిర్లక్ష్యం చేసి వారికి ప్రేత రూపం విడిపించకపోతే ఏం జరుగుతుందో ఇందులో చెబుతున్నాడు.


"ప్రేత రూపం విడిపించని కులాన్ని (కులం = వంశం) పితరులే నాశనం చేస్తారు. అది తామే స్వయంగా చేయవచ్చు. లేదా శత్రువుల చేత చేయించవచ్చు. శరీరం ఉన్నప్పుడు నా వాళ్ళు అనుకొని ప్రేమతో సాకిన పితరులే, ప్రేత రూపం విడిపించకపోతే ఆగర్భశత్రువులుగా మారి పీడిస్తారు."

ప్రేతలు ఎవరెవరిని ఎలా బాధిస్తాయో విష్ణుమూర్తి గరుడునికి చెప్పాడు. ఆయన చెప్పిన దాన్ని బట్టీ మహాలయ పక్షాలు, తిస్రోష్టకాలు, అమావాస్య ప్రాధాన్యత తెలుసుకొని పితరులను అర్చించాలి.


వ్యక్తి మరణానంతరం చేయవలసిన ప్రతి కార్యం గురించి గరుడ పురాణం చెబుతోంది. అవి శ్రద్ధగా చేయాలి. కేవలం దహన సంస్కారమే కాదు, ఆ తర్వాత పదుకొండు రోజుల వరకు ప్రతి రోజూ కర్మ నిర్దేశించబడింది. అవిగాక మాసికాలు, సంవత్సరీకాలు మొదలైనవి చెప్పబడ్డాయి. వాటిని ఖచ్చితంగా శ్రద్ధతో చేయాలి. ఆత్మహత్య, అకాలమరణం, ప్రమాదవశాత్తు మరణించవారికి మరికొన్ని ప్రత్యేక ప్రాయశ్చిత్తాలు చెప్పబడ్డాయి. అప్పుడే మరణించినవారు ప్రేతరూపాన్ని విడిచి పైలోకాలకు వెళ్ళగలుగుతారు. లేదంటే ఆ కుటుంబాలను పితరులే నాశనం చేస్తారు. 

No comments:

Post a Comment