Sunday, 19 September 2021

గాణాపత్యంలోని సౌందర్యం ఏమిటి?



మన ధర్మంలోని కొన్ని సంప్రదాయాలు కొందరు దేవతలను ఒప్పుకోవు. పేర్లు చెప్పవలసిన పనిలేదు గానీ శివుడు, గౌరీ, గణేశుడు, సుబ్రహ్మణ్యుడు మొదలైన దేవతల ఆరాధన అక్కర్లేదని చెప్పే సంప్రదాయాలు కూడా మన ధర్మంలో కనిపిస్తాయి. అదేగాక ప్రతి మతము (సనాతన ధర్మలోని మతాలు - శైవ, శాక్తేయ, వైష్ణవ మొదలైనవి) తాము పూజించే దేవతయే పూర్ణమని, మిగితా దేవతలు కామ్యసిద్ధిని ఇస్తారే గానీ, మోక్షం ఇవ్వరని ప్రతిపాదన చేస్తాయి. కానీ గాణాపత్యంలోని సౌందర్యం ఏమిటంటే అది సకల దేవతలనూ సమానంగా చూస్తుంది. గణపతిని పూర్ణబ్రహ్మంగా ప్రతిపాదించినా; శివుడు, అంబిక, సూర్యుడు, విష్ణువు పరబ్రహ్మస్వరూపాలేనని ప్రతిపాదిస్తుంది. అన్యదేవతలను సైతం ప్రార్ధించాలని చెబుతుంది. ఈ రోజు ఏదైతే మన ధర్మానికి కావాలో అదే అందులో చెప్పబడింది. తాను పూజించే దేవతా మూర్తిని కీర్తిస్తూ, అన్యదేవతలను గౌరవించడం, తక్కువ చేయకపోవడం. 


ముద్గల పురాణంలో కూడా ఇదే విషయం విశేషంగా ప్రస్తావించబడింది. ఉన్నది ఒకటే బ్రహ్మము. అది సర్వకాల సర్వావస్థల్లో సర్వత్రా వ్యాపించి ఉంది. దాన్ని నీవు ఏ రూపంతో ఉపాసిస్తే ఆ రూపంతోనే కోరికలు తీరుస్తుంది. అది నారాయణ, శివ, శక్తి, సూర్య, సుబ్రహ్మణ్య, చివరకు గణేశుడైనా సరే, మనస్సుకు, మాటలకు అతీతుడైన ఆ పరబ్రహ్మమే. సర్వదేవతలకు, సర్వ సృష్టికి మూలం అదే అని ముద్గల మహర్షి స్పష్టంగా చెప్తారు.


మనమంతా ఆదిశంకరాచార్యుల వారు ప్రతిపాదించిన మార్గంలో నడుస్తున్నాము. మనకు శంకరులు చెప్పింది కూడా ఇదే. ఇష్టదేవతను ప్రధాన దేవతగా పూజిస్తూ, ఇతరదేవతలను ఆవరణ దేవతలుగా అర్చించడం. అదే పంచాయతనంలోనూ కనిపిస్తుంది.

No comments:

Post a Comment