Thursday 16 September 2021

సర్వలోక గణపతి నామాలు



స్వానందలోకం అనేది కళ్ళకు కనిపించే పాంచభౌతికమైన లోకం కాదు. అది ఒక ఆధ్యాత్మిక స్థితి అయినప్పటికీ అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు, సర్వలోకమహేశ్వరుడైన గణేశుడు అనేక లోకాల్లో అనేక రూపాల్లో కొలువై ఉన్నాడు.


గణపతి ఏర్పాటు చేసుకున్న మొదటిలోకం చింతామణి. అది దేవతల ఊహకు సైతం అందని ప్రదేశంలో ఉంది. 

కైలాసానికి తూర్పు దిక్కున మలజాత అనే పేరుతో గణేశుడు ఉంటాడు, దాన్ని స్వర్గస్వానందం అంటారు.

భూలోకంలో మోర్గావ్ క్షేత్రంలో బ్రహ్మకమండలు నదీ తీరంలో మయూరేశ్వరుడనే పేరుతో నివసిస్తున్నాడు.

మణిమయమైన నాగలోకంలో శేషాత్మజుడుగా, విష్ణులోకమైన వైకుంఠంలో పుష్టిపతిగా, మణిద్వీపంలో ద్వారాపాలకుడు మహాగణపతిగా, బ్రహ్మలోకంలో బ్రహ్మదేవునకు గురువుగా శారదేశుడనే పేరుతో గణపతి ఉన్నాడు.

ఇంద్రలోకంలో గణపతి కునితాక్షునిగా, అగ్నిలోకంలో రూపవినాయకునిగా, యమలోకంలో కాలునిగా, నైఋతి లోకంలో చండోద్ధండునిగా పూజలందుకుంటున్నాడు.

వరుణలోకంలో పాశపాణి, వాయులోకంలో ధూమ్రుడు, కుబేరునిలోకమైన అలకాపురిలో స్వర్ణాకర్షణ గణేశునిగా, కైలాసంలో శివగణాలకు అధిపతియై హేరంబగణపతిగా పిలువబడుతున్నాడు. 

దైత్యలోకంలో ద్విముఖునిగా, గంధర్వలోకంలో చందనునిగా, భూతలోకంలో ఘుర్ణితాక్షునిగా, సూర్యలోకంలో గణసూర్యునిగా గణపతి వసిస్తున్నాడు. స్కందలోకంలో షణ్ముఖునిగా కొలువై ఉన్నాడు. 

ఆయన ఎక్కడ ఉంటే అది స్వానందలోకం. తమను నరకంలో అగ్నికీలల యందు పడవేసినా, డండనాథుని రూపంలో గణేశుడినే దర్శిస్తామని గాణాపత్యులు అంటారు. గణపతియే సర్వమూ, సర్వమూ గణపతియే. ఇది పరమసత్యాన్ని ఋజువు చేయుటకే ఆయన అన్ని లోకాల్లో, అంతటా ఉంటాడు. గాణాపత్యుడు ఏనాడు కూడా స్వానందలోకం నుంచి క్రిందకు జారడు.


ఓం శ్రీ గణేశాయ నమః 

No comments:

Post a Comment