Saturday 18 September 2021

సిద్ధి బుద్ధి అని ఇద్దరు పత్నులుండగా గణపతిని పత్నీహీనుడని, బ్రహ్మచారి అని ఎందుకు పిలుస్తారు?



సనకాది మునిచతుష్టయం గణక ఋషిని ఇలా అడిగారు - సిద్ధి బుద్ధి అని ఇద్దరు పత్నులుండగా గణపతిని పత్నీహీనుడని, బ్రహ్మచారి అని ఎందుకు పిలుస్తారు? 

 

దానికి గణక ఋషి ఇలా సమాధానమిచ్చారు - దీపంలో వత్తి వంటి వారు బుద్ధి మాత, దీపానికి పోసే తైలం వంటిది సిద్ధిమాత. ఈ దీపపు జ్యోతి సాక్షాత్తు గణపతియే. అగ్నితత్త్వం విశ్వమంతా వ్యాపించి ఉన్నా, అగ్నిని వెలిగించుటకు నూనెతో తడిచిన వత్తి కలిగిన ప్రమిద అవసరము.


బుద్ధి దేవి అనేది శుద్ధమైన జ్ఞానం కాగా, సిద్ధి దేవి మాయ. ప్రమిదలో ఉన్న వత్తి పూర్తిగా తైలాన్ని పీల్చుకుని కాలిపోయేవరకు అగ్ని జ్వలిస్తుంది. ఆ తర్వాత ఆ జ్వాల అగ్నితత్త్వంలో కలిసిపోతుంది. (దీపం కొండెక్కడం/ ఆరిపోవడమంటే అగ్ని అక్కడికి అంతమవ్వడం కాదు. సర్వకాల సర్వావస్థల్లోనూ విశ్వమంతా అగ్ని వ్యాపించి ఉంది. దీపప్రజ్వలనతో అది ఆ ప్రదేశంలో వ్యక్తమవుతోంది).


అలాగే మయామయమైన ఈ ప్రపంచంలో ఉంటూ, సత్యజ్ఞానంతో బ్రహ్మపథంలో ప్రయాణిస్తే, జీవాత్మ పూర్ణబ్రహ్మమైన గణపతిలో ఐక్యమవుతుంది. ఈ గణపతి ఈ సృష్టికి ముందూ ఉన్నాడు, సృష్టి తర్వాత కూడా ఉంటాడు. కానీ ఈ మాయ మరియు జ్ఞానం కలిసినప్పుడే గణపతి వ్యక్తమవుతున్నాడు. జ్ఞానం ద్వారా మాయ తొలగినప్పుడు ఉండేది గణపతి (బ్రహ్మం) మాత్రమే. ఆ స్థితిలో మాయా ఉండదు, జ్ఞానమూ ఉండదు, కానీ సచ్చిదానందుడైన గణపతి మాత్రమే ఉంటాడు. సిద్ధి (మాయ) మరియు బుద్ధి (జ్ఞానం) ద్వారా మాత్రమే గణపతి వ్యక్తమవుతున్నాడు. జీవ భావంతో  చూసినప్పుడు, గణపతికి  ఇద్దరు భార్యలు ఉంటారు. ఆత్మజ్ఞానం ద్వారా జీవునకు మాయ తొలగి జ్ఞానోదయమైనప్పుడు, గణపతిని సర్వవ్యాపిగా, పరతత్త్వంగా గుర్తిస్తాడు. అప్పుడు గణపతిని బ్రహ్మచారిగా భావిస్తారు.


వినాయక రహస్యం పూర్వభాగం 6 వ అధ్యాయం.

No comments:

Post a Comment