కౌపీనమును, యజ్ఞోపవీతమును ధరించి పలాశదండమును, మృగ చర్మమును తీసుకొని బ్రహ్మచారియైన హనుమానుడు సూర్యభగవానుని వైపు చూసి ఆలోచించసాగాడు. ఋషులశాపము తెలిసిన అంజనా దేవి వెంటనే పుత్రునితో ఇట్లా పలికిఇంది. ‘కుమారా! సూర్యుని దూరము నీకొక లెక్క లోనిది కాదు. నీ శక్తి హద్దు లేనిది. అరుణఫలమని తలంచి నీవు బాల్యమున ఎవనిని పట్టుకొనదలచి ఎగిరితివో, అతడు ఈ సూర్యుడే. ఆయనతో నీవు ఆటలాడుకున్నావు. నీవలన రాహువు భయపడి ఇంద్రుని దగ్గరకు పారిపోయినాడు. నిన్ను చూసి ఇన్ద్రుడు కూడా భయపడిపోయినాడు. కుమారా ! నీవు చేయలేని కార్యమేదీ లేదు. నీకు సంభవముకానిదేదీ లేదు. వెళ్ళు, సూర్యుని నుండి చక్కగా జ్ఞానమును పొందు. నీకు శుభమవుతుందీ.
ఇక చెప్పేదేమి? ఆంజనేయుడు తల్లిదండ్రుల చరణములకు మ్రొక్కి వారి ఆశీస్సుల పొందాడు. మరుక్షణమే యతడు ఆకాశమునకు ఎగురగా ఎదుట సూర్యుని సారథి అయిన అరుణుడు కనపడ్డాడు. హనుమంతుడు తండ్రి పేరు చెప్పి తనను పరిచయము చేసుకున్నాడు. అరుణుడు అత సూర్యుని చూపాడు.
అంజనానందనుడు ఎంతో శ్రద్ధతో భువన భాస్కరుని చరణములకు ప్రణమిల్లాడు. సరళత్వము మూర్తీభవించినవాడు, నిశ్చలహృదయుడు. వినమ్రుడు బద్ధాంజలియై ఎదుట నిలువబడియున్న వాడైన పవనకుమారుని చూసి సూర్యదేవుడు 'కుమారా! ఇక్కడెందుకు ఉన్నా' వని అడిగాడు.
హనుమానుఢ అత్యంత వినయముతో ఇట్లా ప్రత్యుత్తరమిచ్చాడు. దేవా! ఉపనయనము గావించి నా తల్లి నన్ను విద్యాధ్యయనమునకై నీకడకు పంపినది. దయ యుంచి నాకు జ్ఞానమును ఉపదేశింపుము’.
ఆదిత్యు డిట్లు పలికాడు - “కుమారా! చూడుము నాస్థితి చాలా విచిత్రమైనది. నేను అహర్నిశలు రథముపై పరుగెడుతుంటాను, ఈ అరుణుడు రథ వేగాన్ని తగ్గించటం ఎరుగడు, ఆకలిదప్పుకలను, నిద్రను త్యజించి నిరంతరం రథమును నడుపుతుంటాడు, ఈ విషయాన్ని పితామహునితో చెప్పుకొనే అధికారము కూడా నాకు లేదు. రథము నుండి దిగుటకు కూడ నాకు వీలు లేదు. ఇలాంటి పరిస్థితిలో నేను నీకు శాస్త్రముల ఎట్లా బోధిస్తాను? ఏమి చేయవలెనో నీవే ఆలోచించి చెప్పు. నీవంటి ఆదర్శబాలుని శిష్యునిగా స్వీకరించుట నాకిష్టమే”.
No comments:
Post a Comment