Thursday, 2 September 2021

శ్రీ హనుమద్భాగవతము (30)



తాపసులిట్లా శపించటం వలన పవనకుమారుని తేజస్సు ఓజస్సు తఱగిపోయింది. అతడు మిక్కిలి సౌమ్యస్వభావము గలవాడయ్యాడు. అప్పటి నుండి అతడు తక్కిన వానర బాలుర వలె ఆశ్రమములలో శాంతస్వభావముతో విహరింపసాగాడు. మృదువగు ఇతని నడవడిచే ఋషులందఱు చాల ప్రసన్నముగా ఉన్డసాగారు.


మాతృబోధ

బాలునిపై తల్లి జీవితప్రభావము, ఆమె ఉపదేశప్రభావము ఎక్కువగా ప్రసరిస్తుంది. ఆదర్శమాతలు తమ పుత్రులను శ్రేష్ఠులుగా, ఆదర్శవంతులుగా తీర్చిదిద్దుతారు, ఇలాంటి ఉదాహరణలెన్నో పురాణములలోను, ఇతిహాసములలోను లభిస్తాయి.


హనుమానుని తల్లియైన అంజనా దేవి పరమ సదాచారిణి, తాపసి, సద్గుణసంపన్నురాలైన ఆదర్శమాత. ఆమె కుమారునికై ఎంత తత్పరతతో కఠోరమైన తపము ఒనరించినదో అంతటి తత్పరతతో ప్రాణప్రియుడైన తన బాలుని జీవితాన్ని చక్కదిద్దుటకు శ్రద్ధవహించింది. ఆమె హనుమానుని వీరకృత్యముల చూసి మనస్సులో మగ్ధురాలవుతూ, అతనికి ప్రోత్సాహాన్ని కలుగ జేస్తూ ఉండెది.


పూజానంతరము రాత్రులయందు పరుండుటకు పూర్వము ఆమె తన ప్రియపుత్రునకు పురాణకథలను, ఆదర్శపురుషుల కథలను వినిపిస్తూ పుత్రుని మనస్సును వాటి వైపునకు ఆకర్షించుటకు ప్రయత్నించుచుండేది. తాను బోధించిన మహాపురుషుల జీవితచరిత్రలను గూర్చి మాటిమాటికి కుమారుని అడుగు చుండేది. బాలుడు నేర్చుకోవలసిన విషయమేమున్నది? సర్వజ్ఞుడు, సర్వాంతర్యామీ అయిన ఈశ్వరునకు తెలియని రహస్యమేమి ఉంటుంది! కాని లీలలో అప్పుడప్పుడు హనుమంతుడు అజ్ఞుని వలె సరిగ్గా సమాధానములను ఇచ్చెడివాడు కాడు. తల్లి మరల కథలను వినిపించి వాటిని బాలునిచే కంఠస్థము చేయిస్తూ ఉండేది. కరుణాసముద్రుడైన భగవానుని అవతారములకు సంబంధించిన కథలన్నీ హనుమంతుని జిహ్వాగ్రము పైననే ఉంటాయి. ఆయన ఆ కథలనన్నింటిని తన తోటి వానర బాలురకు ఎంతో ప్రేమతోను, ఉత్సాహముతోను వినిపించెడి వాడు.


No comments:

Post a Comment