Saturday 11 September 2021

గాణాపత్యం



శివుడిని  పరబ్రహ్మంగా ఆరాధించేవారిని శైవులనీ, విష్ణువును పరబ్రహ్మంగా ఆరాధించేవారిని వైష్ణువులనీ, శక్తిని ప్రత్యేకంగా ఉపాసించేవారిని శాక్తేయులు, సూర్యారాధకులను సౌరులను, సుబ్రహ్మణ్యారాధకులను స్కాందులని అన్నట్లుగానే గణపతిని పరబ్రహ్మంగా పూజించేవారిని గాణాపత్యులు అంటారు. గాణాపత్యం కూడా సనాతనధర్మంలో అనాదిగా ఉన్న మతమే. గాణాపత్యానికి కూడా శైవ, వైష్ణవ, శాక్తేయాలకు ఉన్నన్ని ఆగమాలు, తంత్రశాస్త్రాం, పురాణకథలు, స్మృతిప్రమాణాలు, ఆరాధాన పద్ధతులు, విస్తారమైన వివరణలు, ఆచార్య పరంపర ఉన్నాయి. అనేకమైన ఋషులు, ద్రష్టలు సైతం మనకు గాణాపత్యంలో కనిపిస్తారు. గణపతికి ఏ పూజ ఎలా చేయాలి, ఎప్పుడు చేయాలి, ఎన్ని రోజులు చేయాలి, ఏమేమి సమర్పించాలి, ఎలా సమర్పించాలి వంటి అనేక విషయాలు గాణాపత్యం విస్తారంగా చెబుతుంది.  


శైవులకు ప్రదోషం, మాసశివరాత్రి, మహాశివరాత్రి ఇత్యాదులు, వైష్ణవులకు ఏకాదశులు, శాక్తేయులకు అష్టమి, పూర్ణిమాది తిథులు ఎలా విశేషామో అలాగే గణేశ భక్తులకు చవితి తిథి అంత పవిత్రం. ప్రతి ఏకాదశికి ఒక పేరు, ఒక పురాణ కథ ఉన్నట్లుగానే ప్రతి మాసంలో వచ్చే శుక్లపక్ష, కృష్ణ పక్ష చవితులకు ప్రత్యేక పేర్లు ఉన్నాయి. గాణాపత్య ఆగమాల్లో వాటికి ప్రత్యేక కథలు ఉన్నాయి. ఆరాధన విధులు చెప్పబడ్డాయి. అవేగాక ఇతర పర్వదినాలకు గణపతికి ఉన్న సంబంధం, ఆయా తిథుల్లో గణపతిని పూజించాల్సిన విధులు వాటిల్లో చెప్పబడ్డాయి. మనకు ఇప్పటి వరకు తెలిసింది వినాయక నవరాత్రులు, సంకటహర చవితులు మాత్రమే. కానీ అవి తెలుసుకుంటే నిజంగా ఆశ్చర్యం, ఆనందం కలుగుతాయి.  


శైవం, శాక్తేయం, స్కాందం (కౌమారం), సౌరం, వైష్ణవం లో గణపతికి ప్రత్యేకమైన స్థానం ఉంది. (రామానుజుల శ్రీవైష్ణవం గురించి కాక ఇక్కడ ప్రస్తావించేది ఆదిశంకరుల వైష్ణవం గురించి). గణపతి ఉపాసన లేకుండా మిగితా 5 మతాల్లో ఉపాసన పూర్ణత్వానికి వెళ్ళదు. గణపతికి చెందిన శాస్త్రాలు తెలుసుకోవడం గణపతి భక్తులకు ఎంతో సంతోషాన్ని కలగజేయడమే కాదు, గాణాపత్యం రక్షించబడుటకు సహాయపడుతుంది. 


ఓం శ్రీ గణేశాయ నమః  

No comments:

Post a Comment