దివాకరుడు తప్పించుకొనుటకు ప్రయత్నించాడు, కాని సమీరకుమారునకు ఈ విషయంలో ఎట్టి కష్టమున్నట్లు కనబడలేదు. అతడు చాలా వినయముతో 'దేవా! రథము వేగముగా పయనిస్తే నా అధ్యయనముకు ఏమి ఆటంకము కలుగుతుంది? మీకు ఎలాంటి అసౌకర్యము కలుగురాదు. నేను మీ ఎదుట కూర్చుంటాను. రథ వేగముతో పాటు నేను ముందుకు పయనిస్తానని పలికాడు.
మారుతాత్మజుడు సూర్యదేవుని వైపు ముఖము పెట్టి ఆయనకు ముందుగా సహజరూపంతో పయనిస్తూ ఉండేవాడు.
సూర్యనారాయణునకీ విషయమున ఏ మాత్రం ఆశ్చర్యము కలుగలేదు. సమీరకుమారునిశక్తి యెట్టిదో ఆయనకు తెలుసు. అంతేకాక అతడు స్వయముగా జ్ఞానులలో శ్రేష్ఠుడనీ, శాస్త్రమర్యాదను కాపాడుటకు, తనకు కీర్తిని కలిగించటానికి ఇలా తన దగ్గరకు వచ్చి తన విద్యాభ్యాసము చేయకోరుచున్నాడని సుర్యదేవునకు తెలుసు.
సూర్యభగవానుడు వేదాది శాస్త్రములను, సమస్తవిద్యల అంగోపాంగములను, వాటి రహస్యములను ఎంత శీఘ్రముగా బోధించగకడో అంత త్వరగా బోధించేవాడు. హనుమానుడు శాంతభావముతో దానిని వినేవాడు. ప్రశ్నోత్తరములకు గాని, శంకాసమాధానములకు గాని అక్కడ అవసరము లేకుండెను, ఆదిత్యుడు హనుమంతునకు సంవత్సరములు గాని నెలలు గాని కాక కొన్ని దినములలోనే వేదాదిశాస్త్రములను, ఉప శాస్త్రములను, మిగిలిన విద్యలను బోధించాడు. హనుమంతునిలో సహజంగానే సర్వవిద్యలు నివసించియున్నవి. యథావిధిగా విద్యాభ్యాసము పూర్తియైనవి. ఆయన అన్నిటిలోను పారంగతుడయ్యాడు.
అమితభక్తితో గురుచరణములకు సాష్టాంగ దండ ప్రణామం ఆచరించి చేతులు జోడించి ఆంజనేయుడు 'ప్రభూ! గురు దక్షిణ రూపమున మీరు మీ అభీష్టమును వ్యక్తము చేయవలసినది' యని సూర్యుని ప్రార్థించాడు.
‘నాకేమీ అవసరము లేదు. కాని నీవు నా అంశతో పుట్టినవాడు, వాలికి సోదరుడైన సుగ్రీవునకు రక్షకునిగా ఉన్డునట్లు మాట ఇవ్వు, అట్లా చేసిన నాకు ఎంతో సంతోషము కలుగుతుందీ అని నిష్కాముడగు సూర్యుడు ప్రత్యుత్తరమిచ్చాడు.
‘మీ ఆజ్ఞ నాకు శిరోధార్యము. నేనుండగా సుగ్రీవున కెట్టి ఆపదా సంభవించదు. ఇది నా ప్రతిజ్ఞ' అని అనిలాత్మజుడు గురువు ఎదుట ప్రతిజ్ఞ చేసాడు.
No comments:
Post a Comment