Wednesday 8 September 2021

శ్రీ హనుమద్భాగవతము (36)



శ్లో॥ తతో హనుమానేకం స్వం-పాదం కృత్వోదయాచలే 

అస్తాద్రావేక పాదం చ-తిష్ఠన్న భీముఖో రవేః | 

సాంగోపనిషదో వేదాన్-అవాస్య కపి పుంగవః 

భాస్కరం తోషయామాస-సర్వవిద్య విశారదః ||


శ్రీ ఆంజనేయుడు ఒక పాదమును ఉదయాద్రిపై, మరొక పాదమును అస్తాద్రిపై ఉంచి శ్రీ సూర్యభగవానునకు అభిముఖముగా నిలబడి సాంగోపాంగముగా సకల వేదాలను అభ్యసించి సకలవిద్యాకోవిదుడై తన గురుదేవుడైన సూర్యుని సంతోషపఱచాడు.


శ్లో॥ తస్య బుద్ధించ విద్యాం చ బలశౌర్యపరాక్రమమ్ |

విచార్య తస్మై ప్రదదౌ స్వస్య కన్యాం సువర్చలామ్ || (6వ పటలం)


శ్రీ ఆంజనేయుని సద్బుద్ధిని, విద్యను, బలపరాక్రమాదులను చూసి శ్రీసూర్యభగవానుడు తన కుమార్తెయైన సువర్చలను అతనికి సమర్పించుటకు సంకల్పించాడు.


"బ్రహ్మాది దేవతలు జగత్కల్యాణార్థమై సువర్చలను వివాహమాడవలసినదిగా శ్రీ ఆంజనేయుని అనేక విధాలుగా 

ప్రార్ధించారు. సుమేరు పర్వతముపై శ్రీ సువర్చలాంజనేయుల కళ్యాణమహోత్సవము జరిగింది. సకల దేవతలు, మహర్షులు, ఆ మహోత్సవములో పాల్గొని చరితార్థులైయ్యారు. శ్రీ ఆంజనేయుని స్నాతకోత్సవములో ఒక విచిత్రసంఘటన సంభవించింది.


సంప్రదాయానుసారముగా శ్రీ ఆంజనేయుడు తపమొనరించుటకు బయలు దేరాడు: ఆ సమయములో తపమునకు పోవద్దనీ, తమ సహోదరిని- కళ్యాణమాడి గృహస్థాశ్రమమును స్వీకరించవలసినదనీ బావమరుదులు బావగారిని ప్రార్థించు సమయమాసన్నమయ్యింది. పురోహితులు శ్రీ ఆంజనేయుని బావమరుదులను పిలిచారు. వారు సంయమినీపురాధీశ్వరుడు దండధరుడు అయిన యమధర్మరాజు, గ్రహేశ్వరుడైన శనైశ్చరుడు. వారు శ్రీ ఆంజనేయుని పరిపూర్ణతత్త్వము గ్రహించలేక గర్వితులై స్నాతకోతవ్సమునకు రాకుండా విలంబనమొనరింప సాగారు. వారి మనోగతభావాలను సర్వసాక్షి అయిన శ్రీ ఆంజనేయుడు గ్రహించాడు.


No comments:

Post a Comment