గణేశోత్సవాలు అనాగానే గుర్తుకు వచ్చేది మహారాష్ట్ర. తరతరాలుగా గాణాపత్యం వర్ధిల్లింది ఇక్కడే. అందులోనూ గాణాపత్యానికి కేంద్రబిందువు మోర్గావ్ క్షేత్రం. ఇది అష్టవినాయక క్షేత్రాల్లో ఒకటి. ఇక్కడ గణపతి పేరు మయూరేశ్వరుడు. వైష్ణవులకు శ్రీ రంగం, శైవులకు కాశీ ఎంత పవిత్రమో, గాణాపత్యులకు ఈ మోర్గావ్ క్షేత్రం అంత విశేషం. ఇది స్వర్గలోకం కంటే ఉన్నతమైనదని, ఈ మోర్గావ్ క్షేత్రంలో స్వామిని దర్శిస్తే, బ్రహ్మ పదివి అడిగినా వరిస్తుందని పురాణవచనం. ఈ క్షేత్రంలో స్వామి విగ్రహాన్ని చూసినంత మాత్రం చేతనే ఎన్నో వేల జన్మల పాపాలు దగ్ధమవుతాయని పురాణంలో చెప్పబడింది. ఆ స్వయంభూః స్వామి విగ్రహాన్ని చూడగానే భక్తులకు ప్రశాంతత ఆవరిస్తుంది. ఈ మోర్గావ్ క్షేత్రం గురించి స్కాంద పురాణంలో విశేషంగా చెప్పబడింది. ఇక్కడ గణపతి చుట్టు, గ్రామం చుట్టూ కూడా అనేక దేవతలు ప్రతిష్టితమై ఉన్నారు.
శివునకు కైలాసం, విష్ణవులు వైకుంఠం, లలితాపరమేశ్వరికి మణిద్వీపం ఎలాగో, అలాగే గణపతి ఉండే లోకం పేరు స్వానంద లోకం. గణాపతిని స్వానందేశుడు అంటారు. స్వా అంటే ఆత్మ. ఆత్మానందాన్ని ఇచ్చే లోకం స్వానందలోకం, ఆత్మానందాన్ని ఇచ్చే స్వామి స్వానందేశుడు, ఆయనే మన గణనాథుడు. ఆనందానికి అధిదేవత గణేశుడు. అందుకే ఆయన రూపాన్ని చూసినా, స్మరించినా తెలియని ఆనందం కలుగుతుంది.
మోర్గావ్ క్షేత్రాన్ని భూస్వానందం అంటారు, అనగా ఈ భూమి మీదనున్న స్వానందలోకం. మయూరేశ్వరుడిని భూస్వానందేశ్వరుడు అంటారు. గణపతి భక్తులు తమ జీవితంలో ఒక్కసారైన దర్శించాల్సిన క్షేత్రం మోర్గావ్. ఇది మహారాష్ట్రలోని పూణే జిల్లాలో ఉంది.
భూస్వానందేశో విజయతే
ఓం శ్రీ గణేశాయ నమః
No comments:
Post a Comment