అపుడు కూర్మ, అనంత, పృథ్వీ దేవతలను పూజించి ఆగ్నేయంలోధర్మునీ, నైరృత్యంలో జ్ఞానాన్నీ, వాయవ్యంలో వైరాగ్యాన్నీ, ఈశాన్యంలో ఐశ్వర్యాన్నీ పూజించాలి. ఆ తరువాత క్రమంగా పూర్వాది దిశల్లో అధర్మ, అజ్ఞాన, అవైరాగ్య, అనైశ్వర్యాలను కూడా అర్చించాలి. మండలమధ్యంలో సత్త్వ రజస్తమోగుణాలనూ, అక్కడే కంద(*కందగడ్డ, హారతి కర్పూరం అనే అర్థాలున్నాయి.), నాళ, పద్మాలనూ విధ్యుక్తంగా పూజించాలి. అక్కడే అర్క, సోమ, అగ్ని మండలాలను కూడా పూజించాలి.
విమలాది శక్తులు తొమ్మిదింటినీ తూర్పుతో మొదలుపెట్టి క్రమంగా అన్ని దిక్కుల్లో వారి వారి మంత్రాలతో (శ్రీధర పూజానావిధిలో వలెనే) పూజించాలి.
తరువాత ఒక మంగళమయ ఆసనాన్ని స్నాన, గంధ, పుష్ప, ధూప, దీప, నైవేద్యాదులతో పూజించి దేవాధిదేవుడు, భగవానుడునైన హయగ్రీవుని ఆవాహనం చేసి న్యాసం కూడా చేయాలి. ధ్యానం చేసుకొని శంఖచక్రాది మంగళముద్రలను ప్రదర్శించాలి. తరువాత పాద్య, అర్ఘ్య, ఆచమన, స్నానాలను ప్రదానం చేయాలి. వస్త్రప్రదానం ఆచమనానికి ముందు చేయాలి. సుందరయజ్ఞోపవీతాన్నివ్వాలి. తరువాత భైరవదేవుని మూలమంత్రంతో ఆహ్వానించి పాద్యాదులను సమర్పించి విధివత్తుగా పూజించాలి.
తరువాత శుభదాయినీ, ఐశ్వర్యప్రదాత్రీయైన లక్ష్మీదేవిని పూజించాలి.
తరువాత నలుదిక్కులలో ఇలా
తూర్పులో ఓం శంఖాయ నమః
దక్షిణంలో ఓం పద్మాయ నమః
పడమట ఓం చక్రాయ నమః
ఉత్తరంలో ఓం గదాయై నమః
అని ఉచ్చరిస్తూ ఆయా వస్తువులను అర్చించాలి. తరువాత అదే దిక్ క్రమంలో
ఓం ఖడ్గాయ నమః, ఓం ముసలాయ నమః, ఓం పాశాయ నమః, ఓం అంకుశాయ నమః అనే మంత్రాలతో ఆయా ఆయుధాలనీ వాటి మధ్యలో ఓం సశరాయ ధనుషే నమః అనే మంత్రంలో విల్లమ్ములనూ స్థాపించి పూజించాలి. అదే క్రమంలో ఓంకారమును, యను, నమఃను పెట్టి శ్రీవత్స, కౌస్తుభ, వనమాలా(యై) పీతాంబరాలనూ పూజించి మరల శంఖాదిధారియైన హయగ్రీవస్వామిని అర్చించాలి.