Saturday 6 January 2024

శ్రీ గరుడ పురాణము (55)

 


ఋషులారా! ఈ సందర్భంలోనే పరమాత్మ షడంగ పూజనుపదేశించాడు. అది ఇలా వుంటుంది.


సాధకుడు ప్రారంభంలో దేవునికి అర్ఘ్యమిచ్చే పాత్రను పూజించి అస్త్ర మంత్రాన్నుచ్చరించాలి. అనగా కుడిచేతితో ఎడమచేతి పై శబ్దంచేస్తూ 'ఫట్' అనే మంత్రాన్ని చదవాలి.


తరువాత కవచమంత్రం (హుం) తో శోధనచేసి అమృతకరణ క్రియను పూర్తి చేయాలి. అప్పుడు ఆధారశక్తి మున్నగువాటిని పూజించి ప్రాణాయామం, ఆసనోపవేశనం, దేహశుద్ధి కావించి అమృతేశ భగవానుని ధ్యానించాలి. తరువాత తన ఆత్మను దేవ స్వరూపంగా స్వీకరిస్తూ (అహం బ్రహ్మాస్మి అని మననం చేసుకుంటూ) అంగన్యాస, కరన్యాసం చేసి సాధకుడు తన హృదయ కమలస్థితుడైన జ్యోతిర్మయ ఆత్మదేవుని పూజించాలి. (అంటే కన్నులు సగం మూసి అమృతేశ మంత్రాన్ని పఠిస్తూ తన బొమముడిలోనే జ్యోతిశ్చక్రాన్ని చూడగలగాలి).


అనంతరం దేవునిమూర్తిపైగాని, యజ్ఞ వేదిపై చిత్రింపబడిన దేవునికి గాని సుందరపుష్పాలను సమర్పించాలి. ఆధారశక్తిని పూజించడం ద్వారా ద్వారం వద్దనుండు దేవతలు ఆవాహన చేయబడి పూజింపబడాలి. అందుకే ముందుగా ఆధారశక్తి పూజన ముంటుంది. ఆ పై దేవప్రతిష్ఠా, పరివార సమేతంగా ఆ దేవుని ఆరాధించడం జరుగుతాయి. పరివారంతో బాటు ఆయుధాలనూ, ధర్మాన్నీ కూడా పూజిస్తే దేవతలు సంతోషిస్తారు. ఇంద్రాదిదేవతలనూ వేదాలనూ ఏ వ్రతంలో పూజించినా భుక్తి, ముక్తి లభిస్తాయి. కాబట్టి ఈ షడంగ పూజను విద్వాంసులు విధించారు.


దేవమండలాన్ని పూజించడానికి ముందే మాతృక, గణదేవత, నంది, గంగలనూ దేవస్థానం కుడిభాగంలో మహాకాలునీ, యముననూ పూజించాలి. పూజలో ప్రతిదశలోనూ ఓం అమృతేశ్వర భైరవాయ నమః, ఓం జుం హం సః సూర్యాయ నమః అంటూనే వుండాలి.


అలాగే శివ, కృష్ణ, బ్రహ్మ, చండిక, సరస్వతి, మహాలక్ష్మి దైవతాలను కూడా వారి నామాలకు ముందు 'ఓం' కారమును, చివర నమః ను(దానికి ముందు 'య' లేక 'యై') నూ పెట్టి పూజించాలి.


(అధ్యాయం - 18)


No comments:

Post a Comment