Monday 29 January 2024

శ్రీ గరుడ పురాణము (74)

 


ఈ విధంగా సమస్త కష్టాలనూ దూరం చేసే దేవేశుడైన వాసుదేవ భగవానుని స్తుతించాలి. ఇతర వైదిక స్తుతులతో కూడా విష్ణు దేవుని హృదయంలో భావిస్తూ స్తుతించ వచ్చును. తరువాత విసర్జన చేసి మందిరంలో నుండి బయటికి రావాలి. ఈ పంచతత్త్వ యుక్తమైన విష్ణు పూజ సంపూర్ణకామనలను నెరవేర్చే వాసుదేవుని పూజలలో సర్వశ్రేష్ఠంగా వ్యవహరింపబడుతోంది.


నీలలోహిత శివ మహాదేవా! ఈ పూజనొక్క మారు చేసినా మనిషి కృతకృత్యుడవుతాడు. దీనిని చదివినవారూ, విన్నవారూ, ఇతరులకు వినిపించినవారూ దేహాంతంలో విష్ణులోకాన్ని చేరుకుంటారు".


(అధ్యాయం - 32)


సుదర్శన చక్ర పూజా విధి


సూతుడు శౌనకాది మహామునులకు శివుడు విష్ణువుతో ఇలా అన్నాడని చెప్పసాగాడు. “ఓ శంఖ గదాధరా! గ్రహదోషాలూ, రోగాదులూ, సర్వకష్టాలూ వినష్టములవ్వాలంటే ఏ పూజను చేయాలి?"


"పరమశివా! నీవడిగిన దానికి సమాధానం సుదర్శన పూజ. ఈ పూజకి ముందు సాధకుడు స్నానం చేసి హరిని పూజించాలి. తరువాత తన నిర్మల హృదయ కమలంలో ఆ సుదర్శనాయుధుని నిలుపుకొని ధ్యానించాలి. ఆ తరువాత ఒక మండలాన్ని నిర్మించి అందులో శంఖ, చక్ర, గదా పద్మ భూషణుడైన కిరీటి, భగవానుడైన విష్ణుదేవుని ఆవాహన చేసి గంధ, పుష్ప, ధూప, దీప, నైవేద్యాది వివిధోపచారాలతో పూజించాలి.


పూజ చివరల్లో మూలమంత్రాన్ని నూటయెనిమిది మార్లు జపించాలి. హే రుద్రదేవా! మూలమంత్రమిదివఱకే చెప్పబడింది కదా! ఆ మంత్ర జపం తరువాత సర్వవ్యాధి దోష, కష్ట వినష్టకమైన ఈ సుదర్శన స్తుతిని శ్రద్ధగా పఠించాలి :


నమః సుదర్శనాయైవ సహస్రాదిత్యవర్చసే ॥

జ్వాలా మాలా ప్రదీప్తాయ సహస్రారాయ చక్షుషే । 

సర్వదుష్టవినాశాయ సర్వపాతక మర్దినే ॥ 

సుచక్రాయ విచక్రాయ సర్వమంత్ర విభేదినే 

ప్రసవిత్రే జగద్ధాత్రే జగద్విధ్వంసినే నమః । 

పాలనార్థాయలోకానాందుష్టాసుర వినాశినే । 

ఉగ్రాయ చైవ సౌమ్యాయ చండాయచ నమోనమః ॥ 

నమశ్చక్షుః స్వరూపాయ సంసార భయభేదినే । 

మాయా పంజర భేత్రేచ శివాయచ నమోనమః ॥ 

గ్రహాతిగ్రహరూపాయ గ్రహాణాం పతయే నమః 

కాలాయ మృత్యవేచైవ భీమాయ చ నమో నమః | 

భక్తానుగ్రహదాత్రే చ భక్త గోప్తే నమో నమః ॥ 

విష్ణురూపాయ శాంతాయ చాయు ధానాంధరాయచ ॥

విష్ణుశస్త్రాయ చక్రాయ నమోభూయోనమోనమః ॥


ఈ స్తోత్రాన్ని వేరేగా చదివినా వచ్చే ఫలం ఇలా వుంటుంది.


ఇతిస్తోత్రం మహత్పుణ్యం 

చక్రస్య తవ కీర్తితం ॥ 

యః పఠేత్ పరయాభక్త్యా 

విష్ణులోకం సగచ్ఛతి | 

చక్రపూజా విధింయశ్చ 

పఠేద్రుద్ర జితేంద్రియః । 

సపాపం భస్మసాత్కృత్వా 

విష్ణులోకాయ కల్పతే ॥ (ఆచార 33/7-16)


ఈ విధంగా ఇది విష్ణులోక ప్రాపకం.


No comments:

Post a Comment