Friday 26 January 2024

శ్రీ గరుడ పురాణము (72)

 


పంచతత్త్వార్చన - విధి


'హే పరమాత్మా! తెలుసుకున్నంత మాత్రాననే సాధకునికి పరమపదాన్ని ప్రాప్తింప చేసే సారతత్త్వంలో భాగమైన పంచతత్త్వార్చన ఒకటున్నదని విన్నాను. మాపై దయ వుంచి దానినుపదేశించండి' అని కోరాడు శివుడు.


లోక కల్యాణం కోసం శంకరభగవానుని ఆరాటాన్ని అర్థం చేసుకున్న ఆదిదేవుడు ఆనందభరితుడై ఇలా చెప్పసాగాడు.


'సువ్రతుడవైన శంకరదేవా! మీకా పంచతత్త్వ పూజావిధిని తప్పక వినిపిస్తాను. ఎందుకంటే ఇది దివ్యం, మంగళస్వరూపం, కల్యాణకారి, రహస్యపూర్ణం, శ్రేష్ఠం, అభీష్ట సిద్ధిప్రదం, కలిదోష వినాశకం, పరమపవిత్రం.


హే సదాశివా! పరమాత్మయు, వాసుదేవుడునైన శ్రీహరి అవినాశి, శాంతుడు, సత్త్వస్వరూపుడు, ధ్రువుడు (నిత్యుడు, అచలుడు అని అర్ధము), శుద్ధుడు, సర్వవ్యాపి, నిరంజనుడు. ఆ విష్ణుదేవుడే తన స్వీయమాయ యొక్క ప్రభావం ద్వారా అయిదు ప్రకారాలుగా కనిపిస్తున్నాడు. ఈ ప్రకారాలు అయిదు రూపాలుగా, తత్త్వముగా పూజింపబడుతున్నాయి. విష్ణువు యొక్క పంచరూపాల వాచక మంత్రాలు వారి పేర్లతోనే ఇలా వుంటాయి.


ఓం అం వాసుదేవాయ నమః, 

ఓం ఆం సంకర్షణాయ నమః, 

ఓం అం ప్రద్యుమ్నాయ నమః, 

ఓం అః అనిరుద్ధాయ నమః, 

ఓంఓం నారాయణాయ నమః ।


సర్వపాతకాలనూ, మహాపాతకాలనూ నశింపజేసి పుణ్యాన్ని ప్రదానం చేసి, సర్వ రోగాలనూ దూరం చేసే, అయిదుగురు మహా దైవతముల వాచకాలే ఈ పంచమంత్రాలు.


ఈ పంచదేవ పూజకై సాధకుడు ముందుగా స్నానం చేసి విధివత్తుగా సంధ్యవార్చి మరల కాలుసేతులు కడుగుకొని పూజామందిరలో ప్రవేశించి ఆచమనం చేసి తమ మనసుకు నచ్చిన ఆసనాన్ని వేసుకొని స్థిరంగా కూర్చుని అం క్షౌం రం అనే మంత్రాలనుచ్చరిస్తూ శోషణాది క్రియలను చేయాలి. అనగా శరీరాన్ని పొడిగా చేసుకోవాలి.


No comments:

Post a Comment