Friday, 12 January 2024

శ్రీ గరుడ పురాణము (60)

 


పంచవక్త్ర పూజనం - శివార్చన విధి

ఋషులారా! ఇపుడు పంచముఖ శివుని పూజా విధానాన్ని విన్నవిస్తాను. ఇది సాధకునికి భుక్తినీ ముక్తినీ ప్రసాదిస్తుంది. ముందుగా ఈ క్రింది మంత్రంతో పరమాత్మను ఆవాహనం చేయాలి.

'ఓం భూర్విష్ణవే ఆది భూతాయ సర్వాధారయ మూర్తయే స్వాహా'

తరువాత సద్యోజాత విశేషణధారియైన పరమాత్మ కళను ఈ క్రింది మంత్రంతో ఆవాహనం చేయాలి.

'ఓం హాం సద్యోజాతాయ నమః'

ఈ సద్యోజాత శక్తిలో ఎనిమిది కళలుంటాయి. అవి సిద్ధి, బుద్ధి, ధృతి, లక్ష్మి, మేధ, కాంతి, స్వధ, స్థితి. వీటన్నిటినీ, ఓంకార ప్రతిసర్గతో షష్ఠీ విభక్తితో 'నమః' ను చేర్చి పూజించాలి. (ఉదా॥ సిద్ధిని 'ఓం సిద్ద్యై నమః' అనే మంత్రంతో పూజించాలి.)

తరువాత సాధకుడు

ఓం హీం వామదేవాయ నమః

(కొన్నిచోట్ల హ్రీంకి బదులు హీం వుంది)

అంటూ వామదేవుని పూజించాలి. ఈ శివ స్వరూపానికి పదమూడు కళలు. అవి రజ, రక్ష, రతి, పాల్య, కాంతి, తృష్ణ, మతి, క్రియ, కామ, బుద్ధి, రాత్రి, త్రాసని, మోహిని అనేవి.

అలాగే అఘోర స్వామికీ ఒక మంత్రమూ ఎనిమిది కళలూ వుంటాయి. (ఎందుచేతనో గాని మంత్రమూ బీజాక్షరమూ చెప్పబడలేదు) ఆ కళలు ఇవి : మనోన్మనీ, అఘోర, మోహ, క్షుధ, నిద్ర, మృత్యు, మాయ, భయంకర.

No comments:

Post a Comment