Tuesday, 23 January 2024

శ్రీ గరుడ పురాణము (69)

 


శ్రీ గోపాలదేవుని పూజ-శ్రీధరపూజ త్రైలోక్యమోహన మంత్రం


ఋషులారా! నేనిపుడు భోగమోక్షదాయకాలైన విష్ణురూప దైవతములు గోపాల, శ్రీధరుల పూజా విధానాన్ని వినిపిస్తాను. ముందుగా పూజ కొఱకొక మండలాన్నేర్పాటు చేసి దాని ద్వార ప్రదేశంలో గంగాయమునలనూ, బ్రహ్మ యొక్క శక్తులైన ధాత, విధాతలనూ పూజించాలి. తరువాత లక్ష్మి, శంఖం, పద్మనిధి, శారంగధనువు, శరభాలను పూజించాలి. ఆ తరువాత తూర్పు దెసలో భద్ర, సుభద్రలకూ, దక్షిణ దిశలో చండ ప్రచండులకూ, పడమటి దిక్కున బల, ప్రబలులకూ, ఉత్తరం వైపున జయ విజయులకూ పూజలు చేయాలి. పిమ్మట నాలుగు ద్వారాలలో క్రమంగా లక్ష్మి, గణపతి, దుర్గ, సరస్వతమ్మలను పూజించాలి.


మండలం ఆగ్నేయాది కోణాల్లో పరమ భాగవతోత్తముడైన నారదునీ, సిద్ధులనూ, గురుగ్రహాన్నీ, నలకూబరునీ స్థాపించి పూజించాలి. తూర్పు వైపు విష్ణువునీ విష్ణుశక్తినీ అర్చించాలి. మండలంలో విష్ణు పరివారాన్ని స్థాపించి పూజించాలి. మండలమధ్యంలో శక్తి కూర్మ, అనంత, పృథ్వి, ధర్మ, జ్ఞాన, వైరాగ్య మూర్తులకు ఆగ్నేయాది కోణాల్లో పూజలు చేయాలి. వాయవ్య కోణంలోనూ ఉత్తర దిశలోనూ ప్రకాశ, ఐశ్వర్యాలను పూజించాలి.


'గోపీజన వల్లభాయ స్వాహా' ఇది గోపాల మంత్రం. ఈ మంత్రాన్ని జపిస్తూ మండలంలో తూర్పుతో మొదలెట్టి క్రమంగా ఎనిమిది వైపులా కృష్ణపత్నులైన సుశీల, జాంబతి, రుక్మిణి, సత్యభామ, సునంద, నాగ్నజితి, లక్షణ, మిత్రవిందలను స్థాపించి ఆ తరువాత వారిని పూజించాలి. వెంటనే శ్రీ గోపాలదేవుని శంఖ, చక్ర, గద, పద్మ, ముసల, ఖడ్గ, పాశ, అంకుశ, శ్రీవత్స, కౌస్తుభ, ముకుట, వనమాలాది చిహ్నాలను పూజించాలి. పిమ్మట ఇంద్రాది ధ్వజపాలక దిక్పాలకునూ, విష్వక్సేనునీ, లక్ష్మీసహిత శ్రీకృష్ణ భగవానునీ అర్చించాలి.


గోపీ జన వల్లభమంత్రాన్ని జపించి, ధ్యానించి, సాంగోపాంగంగా ఆయన పూజను పై విధంగా చేసేవారికి సర్వాభీష్ట సిద్ధి కలుగుతుంది.


త్రైలోక్యమోహన శ్రీధరీయ మంత్రం :


ఓం శ్రీం (లేదా శ్రీః) శ్రీధరాయ త్రైలోక్య మోహనాయ నమః । క్లీం పురుషోత్తమాయ త్రైలోక్య మోహనాయ నమః । ఓం విష్ణవే త్రైలోక్య మోహనాయ నమః । ఓం శ్రీం హ్రీం క్లీం త్రైలోక్యమోహనాయ విష్ణవే నమః ।


ఈ మంత్రం సమస్త ప్రయోజనాలనూ సంపూర్ణంగా కలిగిస్తుంది.


No comments:

Post a Comment