Sunday 28 January 2024

శ్రీ గరుడ పురాణము (73)

 


శ్రీ వాసుదేవకృష్ణుడే ఈ జగత్తుకి స్వామి. పీతాంబర విభూషితుడు, సహస్ర సూర్య సమాన తేజఃసంన్నుడు, దేదీప్యమాన మకరాకృతిలో నున్న కుండల సుశోభితుడునగు ఆ శ్రీకృష్ణ భగవానుని ముందుగా ప్రతి హృదయ కమలంలో నిలుపుకొని ధ్యానించాలి. తరువాత సంకర్షణ భగవానుని అనగా బలరామదేవుని, ఆపై యథాక్రమంగా ప్రద్యుమ్న, అనిరుద్ధ, శ్రీమన్నారాయణులను ధ్యానించాలి. పిమ్మట ఆ దేవాధిదేవుని నుండి జనించిన ఇంద్రాది దేవతలను కూడా ధ్యానించాలి. మూలమంత్రం ద్వారా రెండు చేతులతో వ్యాపక రూపంలో కరన్యాసం అనంతరం అంగన్యాస మంత్రాలతో అంగన్యాసం నెరవేర్చి సర్వదేవతలనూ పూజించాలి. ఆ న్యాస మంత్రాలనూ, పూజా మంత్రాలనూ వినిపిస్తాను, వినండి:  తరువాత ఓం పద్మాయ నమః అంటూ స్వస్తిక, సర్వతోభద్రాది మండలాలను నిర్మించి ఆ మండలంలో ఇవే మంత్రాలతో దేవతలందరినీ పూజించాలి.


మూలమంత్రాలతో పాద్యాది నివేదనాన్ని గావించి స్నాన, వస్త్ర, ఆచమన, గంధ పుష్ప, ధూప, దీప, నైవేద్యాదులనర్పించి, ఈ దేవతలకు నమస్కార ప్రదక్షిణలను గావించిన పిమ్మట యధాశక్తి పలుమార్లు మూలమంత్రాన్ని జపించి దాని ఫలాన్ని శ్రీకృష్ణ వాసుదేవ ప్రభునికి అర్పించాలి.


తరువాత వాసుదేవునికి నమస్కరిస్తూ ఈ క్రింది స్తోత్రాన్ని పఠించాలి.


ఓం నమో వాసుదేవాయ నమః, సంకర్షణాయ చ ॥


ప్రద్యుమ్నాయాది దేవాయానిరుద్ధాయ నమోనమః


నమో నారాయణాయైవ నరాణాం పతయే నమః ||


నరపూజ్యాయ కీర్త్యాయ స్తుత్యాయ వరదాయచ ||


అనాదినిధనాయై వ పురాణాయ నమోనమః ||


సృష్టి సంహారక కర్తేచ బ్రహ్మణః పతయే నమః ||


నమో వైవేద వేద్యాయ శంఖచక్రధరాయ చ ||


కలి కల్మష హర్తేచ సురేశాయ నమోనమః ||


సంసార వృక్ష చ్ఛేత్రేచ మాయా భేత్రే నమో నమః ||


బహురూపాయ తీర్థాయ త్రిగుణాయ గుణాయచ |


బ్రహ్మవిష్ణ్వీశరూపాయ మోక్షదాయ నమో నమః ॥ 


మోక్షద్వారాయ ధర్మాయ నిర్వాణాయ నమోనమః ।


సర్వకామ ప్రదాయైవ పరబ్రహ్మ స్వరూపిణే ॥


సంసార సాగరే ఘోరే నిమగ్నం మాం సముద్ధర |


త్వదన్యోనాస్తి దేవేశ నాస్తిత్రాతా జగత్ప్రభో ॥


త్వామేవ సర్వగం విష్ణుం గతోఽహం శరణం తతః |


జ్ఞానదీప ప్రదానేన తమోముక్తం ప్రకాశయ ॥ (ఆచార 32/30-37)


No comments:

Post a Comment