Wednesday, 17 January 2024

శ్రీ గరుడ పురాణము (65)

 


తరువాత పద్మమధ్యంలో నున్న శక్తి అనంతదేవులనూ, పద్మ పూర్వ దళంలో ధర్మాన్నీ, దక్షిణంలో జ్ఞానాన్నీ, పశ్చిమంలో వైరాగ్యాన్నీ, ఉత్తరంలో ఐశ్వర్యాన్నీ, ఆగ్నేయంలో అధర్మాన్నీ, నైరృత్యంలో అజ్ఞానాన్నీ, వాయవ్యంలో అవైరాగ్యాన్నీ, ఈశాన్యంలో అనైశ్వర్యాన్నీ పద్మకర్ణికపై వామా, జ్యేష్ఠాశక్తులనూ మరల తూర్పుతో మొదలుపెట్టి రౌద్రీ, కాలీ, శివా, అసితాది శక్తులనూ పూజించాలి.


తరువాత శివుని కెదురుగా నున్న పీఠంపై ప్రతిష్టింపబడిన కలవికరిణీ, బలవికరిణీ, బలప్రమథినీ, సర్వభూతదమనీ, మనోన్మనీ అనే మహాశక్తులను ఈ దిగువ నీయబడిన మంత్రాలతో పూజించాలి.


ఓం హౌం కలవికరిణ్యై నమః,

ఓం హౌం, బలవికరిణ్యై నమః,

ఓం హౌం బల ప్రమథిన్యై నమః,

ఓం సర్వభూత దమన్యై నమః,

ఓం మనోన్మన్యై నమః ।


తరువాత సాధకుడు ఒక ఆసనం పైకి శివునాహ్వానించి ఆయన మహామూర్తిని స్థాపించాలి. అప్పుడు శివునుద్దేశించి ఆవాహన, స్థాపన, సన్నిధాన, సన్నిరోధ, సకలీకరణాది ముద్రలను చూపించి అర్ఘ్య, పాద్య, ఆచమన, అభ్యంగ, ఉద్వర్తన, స్నానీయ జలాలను సమర్పించాలి. పిమ్మట అరణి- మంథనం చేసి ఆ మహాదేవునికి వస్త్ర, గంధ, పుష్ప, దీప, 'చరు (చరు' అనగా హోమయోగ్యమైన, పక్వం చేయబడిన అన్నము.) నైవేద్యాలను సమర్పించాలి. నైవేద్యానంతరము ఆచమనం చేసి ముఖశుద్ధికై (ముఖమనగా నోరు) తాంబూలము, కరోద్వర్తనం, ఛత్రం, చామరం యజ్ఞోపవీతం, ప్రదానం చేసి పరమీకరణ (పరమీకరణమనగా అర్చనీయదేవునిలో సర్వోత్కృష్టత యను భావము గట్టి పఱచుట) చేయాలి.


పిమ్మట సాధకుడు ఆరాధ్య దైవం ఆకారాన్ని ధరించి ఆయనను జపించి వినమ్రతతో స్తుతించాలి. హృదయాదిన్యాసాలను చేసి సంపూర్ణం గావించు ఈ పూజనే 'షడంగ పూజ' అని వ్యవహరిస్తారు.


No comments:

Post a Comment