Tuesday, 9 January 2024

శ్రీ గరుడ పురాణము (57)

 


మరొక సాధన ఇది. సాధకుడు తన రెండు పాదాగ్రాలలోనూ 'అ ఆ'లనూ, (చీలమండల్లో) గుల్ఫాలలో 'ఇఈ'లనూ, జానువులలో 'ఉఊ'లనూ, కటిలో 'ఏఐ'లనూ, నాభిలో 'ఓ'నూ, ఛాతీ పై 'ఔ'నీ, ముఖంలో 'అం'నీ, మస్తకంలో 'అః' నూ స్థాపించుకొని 'ఓం హంసః' అను బీజమంత్రసహితంగా న్యాసం చేసుకొని నిత్యం జప పూజనాలనూ చేస్తూ వుంటే అతనికి సర్పవిషాన్ని నిర్వీర్యం చేసే శక్తి లభిస్తుంది.


సాధకుడు 'నేను స్వయంగా గరుత్మంతుడను' అను భావనతో ధ్యానంలోకి వెడలి పోయి ఈ మంత్రసాధనను చేయాలి. విషానికి వ్యతిరేకంగా ప్రయోగం చేస్తున్నంత సేపూ అతనిలో 'తాను గరుడుడను' అనే ధ్యాసయే వుండాలి. 'హం' అనే బీజాక్షరం శరీరంలో ప్రవేశించిన విషాదులను హరించే శక్తినికలిగి వుంటుంది. 'హంసః' మంత్రాన్నిఎడమచేతిలో న్యాసం చేసుకొనియున్న సాధకుడు ధ్యాన, పూజన, నిత్య జప శక్తుల సహాయంతో విషాన్ని విరిచివేయడానికి సమర్థుడవుతాడు. ఎందుకంటే ఈ మంత్రం విషధర నాగుల నాసికా భాగాన్నీ, శ్వాస నాళికనీ అదుపు చేసే శక్తినీ, సంపూర్ణ సామర్థ్యాన్నీ కలిగి వుంటుంది. ఈ మంత్రం బాధిత శరీరంలోకీ మాంసంలోకి దూసుకొని పోయి సర్ప విషాన్ని నశింపజేస్తుంది.


పాము కాటుచే మూర్ఛితుడైన ప్రాణి శరీరంపై 'ఓం హంసః' మంత్రాన్ని న్యాసం చేసి భగవంతుడైన నీలకంఠస్వామినీ ఇతరదేవతలనీ కూడా ధ్యానించాలి. దీని వల్ల మంత్రానికి వాయుశక్తి తోడై శీఘ్రంగా సంపూర్ణంగా విషాన్ని హరించగలదు.


ప్రత్యంగిరా జడాన్ని బియ్యం కడిగిన నీళ్ళలో నానబెట్టి పిండితే, రోగి నోటిలోకి, పిండితే విష ప్రభావం తగ్గుతుంది. పునర్నవ (గలిజేరు చెట్టు), ప్రియంగు (పిప్పలి), వక్త్రజ (బ్రాహ్మి) (బారంగి), శ్వేత బృహతి (తెల్లవాకుడు లేదా ములక), కూష్మాండ (గుమ్మడి), అపరాజిత జడం (తక్కిలి), గేరు (ఎఱ్ఱచెట్టు), కమల గట్టఫలం వీటన్నిటినీ నీటిలో వేసి బాగా పిండి నేతితో కలిపి ఒక లేపనాన్ని తయారు చేసి దానిని పాము కాటు బాధితుని శరీరంపై పూస్తే విషం ప్రభావం తగ్గుతుంది. పాము కాటేయగానే ఆ వ్యక్తి చేత వేడి నేతిని త్రాగిస్తే విషప్రభావం మందగిస్తుంది. అలాగే శిరీష వృక్ష పంచాంగాలను (ఆకు, పువ్వు, పండు, వేరు, బెరడు) (ముల్లంగి వంటి దుంప) గాజరబీజాలతో కలిపి నూరి కషాయం చేసి కొంత త్రాగించి, కొంత శరీరానికి పూస్తే సర్పదష్టులకు విషము నుండి విడుదల లభించవచ్చు.


No comments:

Post a Comment