Monday 8 January 2024

శ్రీ గరుడ పురాణము (56)

 


రాత్రి, పగళ్ళ గణన ముప్పది- ముప్పది ఘటికలలో వుంటుంది. ఈ లెక్కను అనుసరించి నిర్మింపబడిన కాలచక్రములో చంద్రుడు పాడ్యమినాడు కాళ్ళ బొటన వ్రేళ్ళలోనూ, విదియనాడు కాళ్ళపైనా, తదియనాడు మోకాళ్ళలోనూ, చవితినాడు వాటికి పైనా, పంచమినాడు తొడల మధ్యలోనూ, షష్ఠినాట నాభిలోనూ, సప్తమినాడు ఛాతీపైనా, అష్టమినాడు స్తనాలలోనూ, నవమినాడు గొంతుపైనా, దశమినాడు ముక్కుపైనా, ఏకాదశినాడు కన్నులలోనూ, ద్వాదశినాడు చెవుల వద్దనూ, త్రయోదశినాడు కనుబొమ్మల మధ్యలోనూ, చతుర్దశినాడు కణతలపైనా, పున్నమి అమావాస్యలలో మస్తకంపైననూ మానవులలో నివాసముంటాడు. చంద్రుడున్న చోట ప్రాణి అంగంపై పాము కాటేసినా ఆ ప్రాణిని బ్రతికించవచ్చును. మూర్ఛ నుండి మెలకువ రావడం ఆలస్యం కావచ్చు కానీ సాధకుడు శరీర మర్దన ద్వారా ఆ ప్రాణిని బ్రతికించగలడు.


ఓం హంసంః అనే నిర్మల స్పటికం లాంటి బీజయుక్త మంత్ర సాధకునికి పరమ మంత్రం. విషరూపంలో నున్న పాపాన్ని నశింపజేసే శక్తి గల ఈ మంత్రాన్ని పాము కాటు వల్ల మూర్ఛిత ప్రాణిపై ప్రయోగించాలి. ఇందులో నాలుగు ప్రకారాలున్నాయి. మొదటిది బీజబిందువుతో, రెండవది అయిదు స్వరాలతో, మూడవది ఆరు స్వరాలతో, నాలుగవది విసర్గతో కూడి వుంటాయి.


ప్రాచీన కాలంలో పక్షిరాజైన గరుత్మంతుడు లోకాలను సర్పాల నుండి రక్షించడం కోసం ఓం కురుకులేస్వాహా అనే మంత్రాన్ని ప్రసాదించాడు. ఈ మహా మంత్ర ద్రష్ట గరుత్మంతుడే. సర్పవిషాలను విరిచి ప్రాణులను కాపాడదలచుకున్న సాధకుడు ముఖంలో 'ఓం'నూ కంఠంలో 'కురు'ను ఇరుగుల్ఫాలలో 'కులే'నీ రెండు పాదాలపై 'స్వాహా' మంత్రాన్నీ శాశ్వతంగా న్యాసం చేయించుకొని వుండాలి. పై మంత్రాన్ని వీలైనన్ని చోట్ల వ్రాయించిన గృహాలలో పాములు నిలువలేవు. ఒక సూత్రాన్ని ఈ మంత్రంతో వేయిమార్లు అభిమంత్రించి చెవిపై ధరించిన వారికి సర్పభయముండదు. అలాగే ఈ మంత్రంతో అభిమంత్రించిన పంచదార పలుకులను విరజిల్లిన ఇంటిలో పాములు నిలవలేవు. దేవతలూ, అసురులూ ఈ మంత్రాన్ని ఏడు లక్షల మార్లు జపించి మంత్రసిద్ధులైనారు.


ఒక అష్టదళపద్మాన్ని చిత్రించి ఓం సువర్ణరేఖే కుక్కుట విగ్రహరూపిణి స్వాహా అనే మంత్రములోని రెండేసి అక్షరాలను ఆ పద్మం యొక్క ఒక్కొక్క దళంపై వ్రాయాలి. ఆ తరువాత ఓం పక్షి స్వాహా అనే మంత్రంతో అభిమంత్రించబడిన జలంతో పాముకుట్టిన వానికి స్నానం చేయిస్తే విషం దూరమౌతుంది.


ఓం పక్షి స్వాహా అనేది కూడా సాధకుల పాలిటి కల్పవృక్షము. ఈ మంత్రం ద్వారా బొటనవ్రేలి నుండి చిటికెన వేలి దాకా కరన్యాసమూ, ముఖ, హృదయ, లింగ, పాదభాగాలపై అంగన్యాసమూ చేసియున్న వ్యక్తి యొక్క నీడనైనా, కలలో కూడా తాకడానికి పాములు భయపడతాయి. ఈ మంత్రాన్ని ఒక లక్షమార్లు జపించి సిద్ధిని పొందిన సాధకుడు పాము కాటుకు గురైన వ్యక్తిని తేరిపార చూస్తే చాలు; ఆ వ్యక్తిలోని కెక్కిన విషం దిగిపోతుంది.


'ఓం హ్రీం హౌం హ్రీం భి (భీ) రుండాయై స్వాహా'- ఈ మంత్ర సాధకుడు దీనిని సర్పదష్టులైన వ్యక్తుల చెవిలో జపిస్తే విషప్రభావం క్షీణిస్తుంది.


No comments:

Post a Comment