Wednesday 10 January 2024

శ్రీ గరుడ పురాణము (58)

 


ఓం హ్రీం అః ను ఉచ్ఛరిస్తూ హృదయ లలాటాదులలో విన్యాసం చేసే సాధకుడికి సర్పాలు వశీభూతాలవుతాయి. ఈ మంత్రాన్ని విధ్యుక్తముగా పదిహేను వేలమార్లు జపించిన వారు గరుడుని వలె సర్వగామి, కవి, విద్వాన్, వేదవిదులు కాగలరు. దీర్ఘాయువులూకాగలరు. ఋషులారా! బలవంతులైన శత్రువులపై విజయ సాధకమైన మంత్రమొకటుంది. ఆ మంత్ర జప విధానాన్ని శివుడుపదేశించాడు. ఇది గోపనీయమైనా మీకు వినిపిస్తాను.


దీనితో అభిమంత్రితాలైన ఆయుధాలకు అపజయమనేది వుండదు.


ఈ మంత్రం ద్వారా ఉద్ధరింపబడదలచుకొన్నవారు కమలపత్రంపై అష్టవర్గాలను నిర్మించి వాటిపై తూర్పుతో మొదలెట్టి ఈశాన్యం దాకా వరుసగా ఓం హ్రీం హ్రీం అనే బీజమంత్రాలను వ్రాసుకుంటూ పోవాలి. ఓం కారం బ్రహ్మబీజమైతే శివకేశవ బీజం హ్రీంకారం. త్రిశూలమును గీసి దాని మూడు తలలపై హ్రీం కారాన్ని లిఖించాలి.


సాధకుడు త్రిశూలాన్ని ధరించి దానిని ఆకాశం వైపు గిరగిరా త్రిప్పగానే సర్పదుష్ట శక్తులు భయపడి పారిపోతాయి. సాధకుడు ధనుర్ధారియై ఆకాశంవైపు నారి సారించి ఈ మంత్రాన్ని మననం చేయగానే దుష్ట విషసర్పాలూ, కుత్సిత గ్రహాలూ, వినాశకర మేఘాలూ, రాక్షసశక్తులూ భయపడి పారిపోతాయి. ఆ ధనుస్సు ధూమ్రవర్ణంలో వుండాలి.


ఈ మంత్రం ముల్లోకాలనూ రక్షించగల సామర్థ్యం గలది. ఇక మృత్యులోకం సంగతి చెప్పనక్కర లేదు కదా!


ఓం జూం సూం హూం ఫట్ అనేది మరొక మంత్రం. సాధకుడు ఎనిమిది కాచు కర్రలను దీనితో అభిమంత్రించి ఎనిమిది దిక్కులలో పాతి వుంచితే ఆ కీలాంకిత క్షేత్రంలో పిడుగుపడకుండా, విద్యుజ్ఞ్వాలలు రగలకుండా ఆ భూమి రక్షింపబడుతుంది. ఇదీ గరుత్మంతుని మంత్రమే. రాత్రి ఎక్కడైనా ఈ మంత్రంతో ఎనిమిది కర్రలను ఇరువది యొక్క మార్లు అభిమంత్రించి ఎనిమిది దిక్కుల్లో పాతి వుంచితే ఆ మధ్య భాగంలో వున్న వారికి సర్వోపద్రవముల నుండీ రక్షణ లభిస్తుంది.


No comments:

Post a Comment